ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి జనజీవనాన్ని ఏడాది పాటు అస్తవ్యస్తం చేసింది. అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయి. ఇపుడిపుడు చాలా రంగాలు పూర్వస్థితికి వస్తూ వున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈ కారణంగా లక్షల మంది ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో జీవనం సాగిస్తున్నారు. వీరిలో చాలామందికి పూట గడవని స్థితి. విద్యా సంవత్సరం మొదలైనప్పటికి విద్యా సంస్థలు తెరవలేని పరిస్థితి.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తన సాటి ఉపాధ్యాయులకు అండగా ఉండాలని మిక్ కళాశాల ప్రొఫెసర్ మరియు ఆచార్య డాట్ నెట్ సంస్థ అధినేత డా.రాజేష్ ‘‘సపోర్ట్ టు టీచర్స్’’ అనే నినాదంతో అతి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఉపాధ్యాయులకు నిత్యావసరాలను తన సొంత ఖర్చుతో అందించసాగారు. తదుపరి తన స్నేహితులు పూర్వ విద్యార్థులు తోడవడంతో దాదాపు 235 మంది రాష్ట్ర నలముమూలల ఉపాధ్యాయులకు నిత్యావసరాలను అందించగలిగారు.
ఈ క్రమంలో డా.రాజేష్ చేస్తున్న ఈ కార్యక్రమానికి స్పందించిన ఎన్నారై ‘నాగ పంచుమర్తి ’ తన వంతు సాయంగా దాదాపు 130 మంది ఉపాధ్యాయులకు 3.5 లక్షల విలువైన నిత్యావసరాలను అందించడానికి ముందుకు వచ్చారు. పలువురికి ఆదర్శ ప్రాయంగా నిలిచారు. తన సహాయాన్ని తానా’చేయూత ద్వారా డా.రాజేష్ కు అందించారు. ఇందులో భాగంగా శనివారం నాడు కృష్ణా జిల్లా కంచికచర్ల, నందిగామ మండలాల్లోని 60 మంది ఉపాధ్యాయులకు 1,50,000 విలువ చేసే నిత్యావసరాలను అందజేశారు.
అతికష్ట కాలంలో ఇంత భారీ సహాయాన్ని అందించిన ‘నాగ పంచుమర్తి’ను ఉపాధ్యాయులు మరియు ప్రజలు గొప్పగా అభివర్ణిస్తూ కీర్తించారు. వచ్చేవారంలో మరో 60 మంది ఉపాధ్యాయులకు ‘నాగ పంచుమర్తి’ అండతో సహాయాన్ని అందించనున్నట్లు డా.రాజేష్ తెలిపారు.