టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతరాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలోని ఆముదాలవలసలో వైసీపీ కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ్మినేని నోరు జారారు. చంద్రబాబుకు బ్లాక్ కమాండోల భద్రతను తీసేస్తే ఆయన ఫినిష్ అయిపోతారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ్మినేని చేసిన సంచలన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
‘‘అధికారం లేకపోతే గిల గిల కొట్టుకొని చచ్చిపోతాడు,ఎందుకండీ…అంతెందుకు? బ్లాక్ కమాండోలు తీసేస్తే చంద్రబాబు ఫినిష్… వారున్నారన్న ధైర్యంతో మాట్లాడుతున్నాడు.. చంద్రబాబుకున్న బ్లాక్ కమాండో, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత తొలగించాలని ఏపీ స్పీకర్ గా సెంట్రల్ గవర్నమెంట్ కు సిఫారసు చేస్తాను… ఎవరిని ఉద్ధరించడానికి ఆయనకు బ్లాక్ క్యాట్ కమాండోల భద్రత? జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతకు ఆయన ఏ విధంగా అర్హుడు? దేశంలో చాలామంది నాయకులకు ముప్పు పొంచి ఉంది…వారందరికీ ఈ స్థాయి భద్రత కల్పిస్తారా?’’ అని తమ్మినేని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఈ క్రమంలోనే తమ్మినేని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టేలా, చంద్రబాబు శత్రువులను రెచ్చగొట్టేలా తమ్మినేని కామెంట్లున్నాయని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై తన వ్యాఖ్యలను తమ్మినేని తక్షణమే వెనక్కు తీసుకోవాలని, బేషరతుగా ఆయనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యత గల స్పీకర్ పదవిలో ఉన్న తమ్మినేని ఈ తరహా వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఏమిటని మండిపడుతున్నారు.