చంద్రబాబునాయుడు భద్రత విషయంలో కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించటం చూస్తే చాలా ఓవర్ గా ఉంది. చంద్రబాబుకు ఉన్న జడ్ ప్లస్ భద్రతను ఉపసంహరించుకోవాలని తాను కేంద్రానికి లేఖరాయబోతున్నట్లు తమ్మినేని చెప్పారు. భద్రత లేకపోతే చంద్రబాబు ఒక్కడుగు కూడా బయటకు పెట్టలేరని సీతారామ్ ఎద్దేవాచేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే చంద్రబాబు భద్రత విషయంలో జోక్యంచేసుకోవాల్సిన అవసరం అసలు స్పీకర్ కు ఏ కోణంలో చూసినా లేదు.
చంద్రబాబుకు కేంద్రం ఇచ్చిన భద్రత వ్యక్తిగత హోదాలో ఇచ్చిందికాదన్న విషయం తమ్మినేని మరచిపోయినట్లున్నారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులకు ఎలాంటి సెక్యూరిటి ఇవ్వాలనేది కేంద్రహోంశాఖ చూసుకుంటుంది. కేటాయించే భద్రత విషయంలో ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఈ ప్రోటోకాల్ కూడా ముఖ్యమంత్రి లేదా మాజీముఖ్యమంత్రుల ప్రాణాలకు ఉన్న ముప్పును కూడా ఎప్పటికప్పుడు రివ్యు చేస్తుంటుంది. దాని ప్రకారమే భద్రత పెంచాలా లేకపోతే తగ్గించాలా అన్నది డిసైడ్ చేస్తుంది. అంతేకానీ హోలుమొత్తంమీద ఉపసంహరణ అన్నది జరగదు.
సంవత్సరాల తరబడి రాజకీయాల్లో ఉన్న తమ్మినేనికి ఇంతచిన్న విషయం తెలీదని అనుకునేందుకు లేదు. పైగా చంద్రబాబు భద్రత విషయంలో తమ్మినేని జోక్యంఏమిటో విచిత్రంగా ఉంది. చంద్రబాబు భద్రత విషయాన్ని చూసుకోవాల్సింది పోలీసు శాఖ మాత్రమే. చంద్రబాబు పర్యటనల విషయంలో అవసరమైన భద్రతను కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీసు శాఖ మీదే ఉంది. నిజానికి చంద్రబాబు భద్రత విషయంలో జగన్మోహన్ రెడ్డి జోక్యం కూడా ఉండదు.
స్పీకర్ అధికారాలు ఎంతవరకు అంటే కేవలం అసెంబ్లీ వ్యవహారాల వరకు మాత్రమే. అసెంబ్లీ దాటితో ప్రోటోకాల్ ఉంటుందే కానీ స్పీకర్ అధికారాలు ఏమీ ఉండవు. ఇక భద్రత లేకపోతే కాలు బయటపెట్టలేరని చెప్పటం కూడా విచిత్రమే. భద్రత లేకుండా ఏ రాజకీయనాయకుడు బయట తిరగ్గలుగుతున్నారు. కాబట్టి ఓవర్ యాక్షన్ చేసి అందరిలో నవ్వులపాలయ్యే బదులు సీతారామ్ తన పరిధి ఏమిటో తెలుసుకుని వ్యవహరిస్తే ప్రభుత్వానికి మంచిది. లేకపోతే స్పీకర్ లాంటివాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ కు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సుంటుంది.