వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను అని అంటున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అదేవిధంగా వీలుంటే తనను రాజ్యసభకు పంపితే ఆనందిస్తానని కూడా అంటున్నారాయన. తన భార్యను వచ్చే ఎన్నికల్లో పోటీలోకి దింపాలని కూడా యోచిస్తున్నారు సీతారాం.
వాణీ సీతారాం ఇప్పటికే సర్పంచ్ గా ఉన్నారు. తొగరాం సర్పంచ్‌గా ఉన్నారు. మొన్నటి స్థానిక ఎన్నికల్లో 510 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అని ప్రధాన మీడియా వెల్లడించింది. అటుపై వాణీ సీతారాం హయాంలో చాలా నిర్ణయాధికారాలు చెలామణి అయ్యాయి. ఇవన్నీ జగన్ దృష్టికి కూడా వెళ్లాయి.
స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. పొందూరులో స్పీకర్ కు పట్టులేదు. ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లో కూడా స్పీకర్ ఒకనాటి హవా ఏమీ లేదు.కనుక ఈ సారి స్పీకర్ కు నో ఛాన్స్. కానీ మంత్రిగా ఒక్క అవకాశం ఇవ్వాలని జగన్ ను పదే పదే కోరుతూ గంటల తరబడి ఆయనతో సమావేశం అవుతూ తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారని టాక్.ఇదే సమయంలో కొడుకు నాగ్ కు కూడా వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవి దక్కించాలన్న తాపత్రయంలో ఉన్నారు.
ఈయన కూడా అనేక వివాదాల్లో ఉన్నవారే! నియోజకవర్గంలో వాణీ సీతారాం, నాగ్ హవా ప్రస్తుతం అయితే బాగానే నడుస్తోంది. అధికార దుర్వినియోగానికి సంబంధించి పలు సార్లు ఆడియో టేపులు కూడా వచ్చాయి. నియోజకవర్గ పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్ అభివృద్ధికి కానీ ఇక్కడ రోడ్ ఓవర్ బ్రిడ్జి క్లుప్తంగా ఆర్ఓబీ నిర్మాణానికి కానీ స్టేషన్ కు వెళ్లే దారిని బాగు చేసే విషయమై కానీ తమ్మినేని తీసుకున్న చొరవ కూడా ఏమీ లేదు.
కానీ విపక్ష సభ్యులయిన జనసేన కార్యకర్తలపై మాత్రం భౌతిక దాడులకు పాల్పడుతున్న దాఖలాలు ఆధార సహితంగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో స్పీకర్ గొంతెమ్మ కోర్కెలు తీర్చడం అయితే అసాధ్యం అనే తేలిపోయింది. ఇక్కడ ప్రత్యర్థి అయిన తమ్మినేని అల్లుడు కూన రవి కి మంచి ప్రజా మద్దతు ఉంది.గతంలో ఇసుక ర్యాంపుల నిర్వహణ విషయమై చినబాబు జోక్యం కారణంగా కొంత ఆరోపణలు ఎదుర్కొన్నా కూడా వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే అని
ఇక్కడి రాజకీయ వర్గాలు అంటున్నాయి. అదే విధంగా రైల్వే స్టేషన్ అభివృద్ధికి యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు కింజరాపు తీసుకుంటున్న శ్రద్ధ మంచి ఫలితాలు ఇస్తుంది. రామూ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఆమదాల వలస నియోజకవర్గం ఉండడం, పలు ప్రజా పోరాటాలు కూన కుటుంబం, కింజరాపు కుటుంబం కలిసి చేయడం అన్నవి ఇక్కడ టీడీపీ గెలుపునకు ఎంతగానో కలిసివచ్చే అంశాలు మరియు అవకాశాలు కూడా!