“ఎక్కడో శ్రీకాకుళం.. అక్కడ ఓ మూల విసిరేసినట్టు ఉండే ఆముదాలవలస. అక్కడ గెలిచిన నన్ను మంత్రి ని చేయడమేంటి? మీరెవరైనా అనుకున్నారా?. ఇది చంద్రబాబు తప్ప ఇంకెవరు చేయగలరు! దటీజ్ బాబు!!“- 1990లలోకి తొంగి చూస్తే.. ఈ మాట పదే పదే చెప్పిన ప్రస్తుత ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా తడిమి చూసుకుంటారు. ఎందుకంటే.. ఆయన అప్పట్లో ఉమ్మడి ఏపీ విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఈ వ్యాఖ్యలు బహుశ ఆయన కూడా మరిచిపోయి ఉండొచ్చు.
కానీ, అప్పట్లో తమ్మినేని వ్యాఖ్యలు గుర్తున్న చాలా మంది టీడీపీ సీనియర్లు, రాజకీయ విశ్లేషకులు, జర్నలి స్టులు సైతం.. ఇప్పుడు ఆయన అదే చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను విని నివ్వెర పోతున్నారు. తాజాగా తమ్మినేని తన సొంత జిల్లా శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఒకప్పుడు తనకు మంత్రి పదవి ఇచ్చి, సమున్నత స్థానంలో కూర్చోబెట్టి గౌరవించిన చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ కార్పొరేషన్ కేసులో అరెస్టయి జైల్లో ఉన్నారు. అయితే.. ఆయనకు సంఘీభావంగా పార్టీ శ్రేణులు, అభిమానులు కదం తొక్కుతున్నారు. ఆయన సతీమణి భువనేశ్వరి.. నిజం గెలవాలి పేరుతో యాత్ర చేస్తున్నారు. ఈ పరిణామాలపై ప్రజలు ఆసక్తిగా సానుభూతితో స్పందిస్తున్నారు. కానీ, గతంలో సుదీర్ఘ కాలం పాటు చంద్రబాబు దగ్గర పనిచేసి, అనేక పదవులు పొంది.. చివరకు పార్టీ చీఫ్గా కూడా జిల్లాకు వ్యవహరించిన ప్రస్తుత స్పీకర్ తమ్మినేని మాత్రం తన అక్కసును బయట పెట్టుకున్నారు.
“చంద్రబాబు ఈ జన్మకు జైల్లోంచి రాడు… ఉన్న విషయం చెబుతున్నా…! నిజమే ఖచ్చితంగా గెలుస్తుందమ్మా…!! నువ్వేం గాబరా పడకు… నిజమే గెలిస్తే… మీ ఆయన జీవితకాలం జైల్లో ఉండాలి.. అందులో అనుమానం లేదు“ అంటూ.. నారా భువనేశ్వరి చేస్తున్న నిజం గెలవాలి యాత్రపై స్పీకర్ తమ్మినేని చేసిన వ్యాఖ్యలను అన్ని వర్గాలు తప్పుబడుతున్నాయి. “నాడు మంత్రిని చేసిన నేతపై ఇంత అక్కసా తమ్మినేనీ?!“ అంటూ నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.