టాలీవుడ్ లో సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజకు ఓ ప్రత్యేకత ఉంది. సినీరంగానికి చెందిన సమస్యలపైనే కాకుండా….సమకాలీన, రాజకీయ అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందిస్తుంటారు. విషయం ఏదైనా…తాను చెప్పదలుచుకున్నది ముక్కుసూటిగా….నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన నైజం. టాలీవుడ్ సెలబ్రిటీల `డ్రగ్స్` కేసు ఎపిసోడ్ మొదలు మొన్న జగన్ కు చిరంజీవి దండం పెట్టడం వరకు తాను చెప్పదలుచుకున్నది చెప్పేసి వార్తల్లో నిలిచారు తమ్మారెడ్డి.
ఓ సినిమా స్క్రిప్టును ఆ సినిమాలోని అందరు నటీనటులకు, టెక్నీషియన్లకు తెలియజేస్తే వచ్చే ఫలితాలు మరో స్థాయిలో ఉంటాయని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డ సంగతి చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఇలా జరుగుతుందని, తెలుగు దర్శకులు కూడా ఆ తరహా వర్క్ షాపులను నిర్వహించే పద్ధతిని అందిపుచ్చుకోవాలని చిరంజీవి సూచించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి కామెంట్లపై తమ్మారెడ్డి తనదైన రీతిలో తన యూట్యూబ్ ఛానెల్లో స్పందించారు.
టాలీవుడ్ లో స్క్రిప్ట్ లు, దర్శకులను ఎంచుకునేది హీరోలని, దర్శకులు కాదని చిరుకు తమ్మారెడ్డి చురకలంటించారు. చాలామంది దర్శకుల పనితీరు గురించి తెలుసుకొని వారిని హీరోలు అప్రోచ్ అవుతారని, కానీ, వారి పనితనం నచ్చితేనే హీరోలు సినిమాలు తీయాలని సూచించారు. చాలామంది డైరెక్టర్లు హీరోలు చెప్పింది వినరని, కొద్ది మంది మాత్రమే హీరోలు చెప్పిన పాయింట్లు వింటారని అన్నారు. హీరోలు సినిమాలు సెలెక్ట్ చేయడం వల్లే చాలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని అభిప్రాయపడ్డారు.
హీరోలు డేట్స్ ఇస్తే చాలు, వాళ్ళు ఒప్పుకొన్న కథలు చేస్తే చాలని నిర్మాతలు అనుకోవడం వల్ల సరైన సినిమాలు రావడం లేదని తమ్మారెడ్డి కామెంట్ చేశారు. ప్రేక్షకుడి కోసం ఆలోచించడం లేదని… థియేటర్లు వదిలేసి, ఓటీటీ – శాటిలైట్ కోసం ఆలోచించడం వల్ల ఫలితాలు బాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. హీరోలు, శాటిలైట్, ఓటీటీ కోసం సినిమాలు తీయకూడదని… థియేటర్ ప్రేక్షకుల కోసం సినిమాలు తీయాలని సూచించారు.