సీఎం జగన్ తో భేటీ సందర్భంగా ఆయనతో మెగా స్టార్ చిరంజీవి మాట్లాడిన వీడియో ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. జగన్ ను రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉంచిన చిరు…ఆయనకు చేతులు జోడించి మరీ తమ సమస్యలను పరిష్కరించాలంటూ విన్నపాలు చేయడంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. చిరంజీవి ఎంత ఎదిగినా ఒదిగి ఉంటున్నారని ఆయన ఫ్యాన్స్ అంటుంటే…చిరంజీవి తన స్థాయిని మరచి ఇంతలా దండం పెట్టి మరీ అడగాలా అంటూ వర్మ వంటి మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి తన స్థాయిని మరిచి అంతలా అభ్యర్థించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. చిరంజీవిని ఇండస్ట్రీకి పెద్దగా తాము భావిస్తున్నామని, ఆయనకు ఓ ఆత్మగౌరవం ఉంటుందని అన్నారు. స్వతహాగా చిరంజీవే చాలా పెద్దమనిషని, ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా సీఎం దగ్గరకు వెళ్లారని తెలిపారు.
జగన్ తో చిరంజీవి మాట్లాడుతున్న వీడియో చూసినప్పుడు తనకు చాలా బాధేసిందని, ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టిమరీ యాచించినట్టుగా ఉందని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అలా అడగడం చూసి మనం ఇలాంటి దారుణమైన స్టేజ్ లో ఉన్నామా? అని బాధేసిందని అన్నారు. ఈ భేటీలో టికెట్ ధరల గురించి తప్ప ఇతర సమస్యల గురించి ప్రస్తావన వచ్చినట్టు అనిపించడం లేదన్నారు. కరోనా వల్లే సినిమాలు విడుదల కాలేదని, కానీ, టికెట్ ధరల వల్ల సినిమాలు విడుదల కాలేదని చిరంజీవి చెప్పడం బాధాకరమన్నారు.
పాత టికెట్ ధరలతోనే ‘అఖండ’, ‘పుష్ప’ సినిమాలు మంచి వసూళ్లు రాబట్టాయని, మరో రూ. 20 నుంచి 25 కోట్ల వసూళ్ల కోసం చిరు, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి వంటి వారు అంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. మనం శాసించే వాళ్లం కాదని, కానీ, ట్యాక్సులు కడుతున్నామని అన్నారు. మన గౌరవాన్ని కాపాడుకుంటూనే మనం మాట్లాడాలని… అణగారిపోయిన వర్గంలా ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు.