పక్క రాష్ట్రం తమిళ నాడు నుంచి అక్రమంగా ఏపీలోకి వస్తున్న బియ్యం తదితర వివరాలు, స్మగ్లింగ్ పై చంద్రబాబు స్టాలిన్ కు లేఖ రాసిన విషయం విధితమే! వీటికి సంబంధించి ఆధారాలతో సహా బాబు తన లేఖను రాయడంతో స్టాలిన్ అప్రమత్తం అయ్యారు.
అక్కడ పౌర సరఫరాల శాఖకు సంబంధించిన నేర శోధన విభాగం వెంటనే అలర్ట్ అయింది. సోదాలు జరిపి, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నాలు సైతం ముమ్మరం చేసింది. సరిహద్దుల్లో నిఘా పెంచాలన్న బాబు ప్రతిపాదనకు సైతం స్టాలిన్ సానుకూలంగానే స్పందించి, తన హుందాతనం చాటుకున్నారు.
తమిళనాట నిన్నటివేళ తిరుమలైనగర్ కు చెందిన సుబ్రహ్మణియన్ ఇంట్లో పౌర సరఫరాల శాఖ కు చెందిన నేర శోధన విభాగం తనిఖీలు చేయడంతో ఈ విషయం కాస్త అక్కడ హైలెట్ అయింది. ఈ సందర్భంగా 12 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారని ప్రధాన మీడియా వెల్లడి చేస్తోంది. అదే విధంగా సుబ్రహ్మణియన్ ను అరెస్టు చేశారు. ఇప్పుడిదే ఇరు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది.
“మన రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు అందాల్సిన బియ్యం రెండ్నెల్లుగా అందడం లేదు. అంతకుమునుపు ఆ బియ్యం కాస్త కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలిపోయింది. కానీ తమిళ నాడు బియ్యం మాత్రం మన రైసు మిల్లులకు చేరిపోయి పోలిష్ అనంతరం బహిరంగ మార్కెట్లలో అధిక ధరలకు అమ్ముడయిపోతున్నా నిఘా అధికారులకు ఇవేవీ పట్టడం లేదు” అన్నది తెలుగుదేశం పార్టీ ఆవేదన మరియు ఆరోపణ కూడా !