రాజకీయాల్లో పొగడ్తలు సర్వసాధారణం. పార్టీ అధినేతను మచ్చిక చేసుకుంటే.. పదవులు వస్తాయనో.. ప్రాభవం పెరుగుతుందనో భావించే నాయకులు ఇటీవల కాలంలో పెరుగుతున్నారు. పార్టీలు ఏవైనా.. అధినాయకులు ఎంతటివారైనా.. వారిని ప్రసన్నం చేసుకునేందుకు కిందిస్థాయి నాయకులు.. వ్యూహాల కు తోడు.. అవకాశం వచ్చినప్పుడల్లా.. పొగడ్తలు, ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక, ఈ పొగడ్తలే.. తమకు ప్రత్యేక ఆశీర్వాదం అనుకుంటున్నారో.. ఏమో.. పార్టీల నాయకులు.. పొగిడే వారిని ప్రోత్సహిస్తు న్నారు.
అయితే.. ఈ పొగడ్తలు ఎంతదూరం వెళ్తున్నాయంటే.. చట్టసభల్లోనూ ముఖ్యమంత్రిని నేరుగా ప్రశంసిస్తు న్నారు. ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజల సొమ్ముతో నిర్వహించే పవిత్ర చట్టసభల ను కూడా పబ్లిక్ మీటింగ్ ప్రదేశాలుగా మార్చేసి.. పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఒకప్పుడు.. తమిళనాడుకే పరిమితమైన ఈ పొగడ్తల సంస్కృతి.. ఏపీకి కూడా విస్తరించింది. నవ్యాంధ్రలో చంద్రబాబు కూడా పొగడ్తలకు పడిపోయారనే పేరుండేది. ఇక,ఈ సంస్కృతి.. జగన్ ప్రభుత్వంలో మరీ ఎక్కువైంది. రాజకీయ నేతల నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్ల వరకు జగన్ను పొగడకుండా ఉండలేని పరిస్థితి!
కట్ చేస్తే.. పొగడ్తలకు, అధినేతలకు గుడులు కట్టడాలకు.. ప్రఖ్యాతి చెందిన తమిళనాడులో ఇప్పుడు సంస్కృతి మారేందుకు సీఎం స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు. తన హయాంలో పొగడ్తతలకు, ప్రశంసలకు తావు లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.
పొగడ్తలకు తాను దూరమని పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను హెచ్చరించారు. అసెంబ్లీలో పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రశంసిస్తూ.. సమయా న్ని వృథా చేయకుండా సభా కార్యకలాపాలను కొనసాగించాలని చెప్పారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. తమిళనాడు కోర్టు రుసుములు, వ్యాజ్యాల విలువల చట్టం-1955 సవరణ బిల్లు ప్రవేశపెడుతున్న క్రమంలో న్యాయశాఖ మంత్రి ఎస్ రఘుపతి.. పార్టీ నాయకులపై ప్రశంసలు కురిపించారు. దాంతో.. వ్యక్తి ఆరాధన మానుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు.
“ప్రతిదానికీ ఓ పరిమితి ఉంది. నేను ప్రతిసారీ దాన్ని గుర్తుచేయలేను. అలాంటివి మానుకోవాలని నేను ఇప్పటికే సూచించాను. అయినా.. కొనసాగిస్తున్నారు. అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టేప్పుడు, ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, డిమాండ్లపై చర్చిస్తున్నప్పుడు ప్రశంసిస్తూ మాట్లాడితే వారిపై చర్యలు తీసుకుంటాం. ఇది అభ్యర్థన కాదు, ఆదేశం.“ అని స్టాలిన్ చెప్పడం గమనార్హం.
మరి.. స్టాలిన్ను తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి సైతం ఆహ్వానించిన.. జగన్.. ఇప్పుడు ఆదర్శవం తమైన వ్యాఖ్యలను కూడా స్వాగతిస్తారా? సభలో నిత్యం తనను ప్రశంసించి.. పొగడ్తలతో ముంచెత్తే నేతలను కట్టడి చేస్తారా? లేక భజనకే ప్రాధాన్యం ఇస్తారా? అనేది చూడాలి.