తెలంగాణలోని బీఆర్ ఎస్ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళి సైకి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు రెండేళ్లుగా సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ అన్నట్టుగా విభేదాలు రోడ్డెక్కాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని తమిళి సై తిరస్కరించిన నాటి నుంచి ఇరు పక్షాల మధ్య పొసగని విషయం తెలిసిందే. ఏ కార్యక్రమానికీ కూడా ఇరు పక్షాలు సహకరించుకున్నది లేదు. పండగలైనా.. పబ్బాలైనా.. ఎవరికి వారుగానే చేసుకుంటున్నారు. ఇక, ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు.
తనకు ప్రొటోకాల్ అమలు చేయడం లేదని.. తాను ఎక్కడికి వెళ్లినా.. సొంత ఖర్చు పెట్టుకుని వెళ్తున్నానని గతంలో తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా కేంద్రానికి పలుమార్లు రాష్ట్రప్రభుత్వ తీరుపైనా ఆమె ఫిర్యాదులు చేశారని ప్రచారం జరిగింది. గణతంత్ర దినోత్సవం సహా.. పలు జాతీయ పండుగలకు కూడా గవర్నర్‌కు ఆహ్వానాలు అందలేదు. ఇక, అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు కూడా ఆమెను ఆహ్వానించలేదు. అయితే.. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం విషయాన్ని హైకోర్టు వరకు తీసుకువెళ్లిన గవర్నర్ పట్టుబట్టి దానిని సాధించుకున్నారు.
అయినా కూడా ఇరు పక్షాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా గవర్నర్‌పై కోర్టుకు వెళ్లింది. తాము ప్రజాప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని చేసిన కీలక బిల్లులను ఆమె ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారంటూ..ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇది కొన్నాళ్ల కిందట విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి విచార ణకు వచ్చిన ఈ కేసు విషయంలో వెంటనే స్పందించిన గవర్నర్ తన దగ్గర ఉన్న మూడు పెండింగు బిల్లుల్లో ఒక దానిని తిరస్క రించేశారు. మిగిలిన రెండు బిల్లులను కూడా వివరణ కోరుతూ ప్రభుత్వానికి తిప్పిపంపారు.
మొత్తంగా బిల్లులు తన దగ్గర పెండింగు లేకుండా అయితే.. గవర్నర్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సమయంలో ఆమె తన మన సులో మాటను బయటకు వెళ్లగక్కారు. రెండేళ్లుగా సీఎం కేసీఆర్ తనతో మాట్లాడలేదని అన్నారు. అంతేకాదు.. రాజ్యాంగం ప్రకారం కూడా సీఎం కేసీఆర్ తనతో చర్చించాలని ఆర్టికల్ 167 చెబుతోందన్నారు. అయినా..కూడా ఆయన దీనిని పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం రూపొందించే బిల్లులపై తనతో చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. మొత్తానికి తమిళి సై మనసులో బాధంగా సీఎం తనతో మాట్లాడడం లేదనేవిషయం ఈ సందర్భంగా స్పస్టమైందని అంటున్నారు పరిశీలకులు.