తమిళ నటి విజయలక్ష్మీ మరోసారి వార్తల్లోకి వచ్చారు. తరచూ ఏదో ఒక సంచలనంతో.. వ్యక్తిగత వివాదంతో వార్తల్లోకి ఎక్కే ఆమెకు.. తాజాగా అనుకోని షాక్ తగిలింది. మూడు నెలలుగా ఆమె ఉంటున్న ప్లాట్ కు అద్దె చెల్లించని కారణంగా.. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేసరికి.. ప్లాట్ లో మరొకరు ఉండటం.. తన సామాన్లు కనిపించకపోవటంతోఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి వేళ.. తనను రోడ్డున పడేశారంటూ ఆరోపిస్తూ.. మీడియా ముందుకు వచ్చారు. దీంతో.. ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఇంతకూ జరిగిందేమంటే…..
చెన్నైలోని టీనగర్ హబీబుల్లా రోడ్డులోని ఒక సర్వీసు అపార్ట్ మెంట్ లో నటి విజయలక్ష్మీ.. ఆమె సోదరి ఉంటున్నారు. ఇటీవల ఆమె సోదరి అనారోగ్యానికి గురి కావటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా డిశ్చార్జి అయిన ఆమె.. ఇంటికి తిరిగి వచ్చేసరికి.. తన ప్లాట్ లో వేరే వారు ఉండటం.. తన సామాన్లు అందులో లేకపోవటంతో ఆందోళన చెందారు. మేనేజర్ కు ఫోన్ చేశారు.
మూడు నెలలుగా అద్దె చెల్లించని కారణంగా ఆమె సామాన్లను వేరే గదిలో ఉంచినట్లుగా పేర్కొన్నారు. దీంతో ఆగ్రహం చెందిన ఆమె మీడియాకుసమాచారం అందించి హడావుడి షురూ చేశారు.
కొద్దిరోజుల క్రితం నటుడు.. దర్శకుడు.. తమిళర్ కట్చి నేత సీమాన్ తనను మోసం చేసినట్లుగా ఆరోపిస్తూ విజయలక్ష్మి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీమాన్ కు ఆమె వ్యతిరేకంగా పని చేశారు. ఒక దశలో ఆత్మహత్యాయత్నం చేయటం సంచలనంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె అనూహ్యంగా సీమాన్ సాయం కోరటం గమనార్హం.
రాత్రి వేళ తనకు ఎదురైన చేదు అనుభవంతో తల్లడిల్లిన ఆమె.. కన్నీటి పర్యంతం అవుతు సీమాన్ అయినా తనను ఆదుకోవాలని వాపోయారు. ఇదిలా ఉండగా.. ఆమె హడావుడితో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. విషయం తెలుసుకొని ప్రత్యామ్నాయ వసతి కల్పించారు. ఇప్పటివరకు సీమాన్ ను నోటికి వచ్చినట్లుగా విమర్శలు చేసిన ఆమె.. కష్టం మీద పడిన వేళలో.. తిట్టిన నోటితోనే సీమాన్ ను సాయం చేయాలని కోరటం గమనార్హం.