ప్రముఖ తమిళ సినీ నటుడు డేనియెల్ బాలాజీ హఠాన్మరణం తమిళ సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. శుక్రవారం నాడు బాలాజీ(48) గుండెపోటుతో మృతి చెందారు. బాలాజీకి ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి బాలాజీ తుది శ్వాస విడిచారు. బాలాజీ ఆకస్మిక మరణం పట్ల పలువురు తమిళ సినీ నటులు, దర్శకనిర్మాతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కమల్ హాసన్ చిత్రం ‘మరుదునయగమ్’తో ప్రొడక్షన్ మేనేజర్‌గా డేనియల్ బాలాజీ తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ చిత్ర నిర్మాణం అనుకోకుండా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత రాధిక శరత్‌కుమార్ ‘ఛిత్తీ’(తెలుగులో ‘పిన్ని’) సీరియల్లో డేనియెల్ పాత్ర బాలాజీకి మంచి పేరు తెచ్చింది. అప్పటి నుంచి డేనియెల్ బాలాజీగా బాలాజీ బాగా పాపులర్ అయ్యారు. కమలహాసన్ నటించిన ‘రాఘవన్’ సినిమాలో సైకో మెడికో పాత్రలో డేనియల్ బాలాజీ నటన తెలుగు ప్రేక్షకులను, విమర్శకులను సైతం ఆకట్టుకుంది. పలు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ చిత్రాల్లో కీలక పాత్రల్లో విలన్ గా బాలాజీ నటించి ప్రేక్షకులను మెప్పించారు.