విజయ్ టీవీలో ప్రసారమయ్యే పాండియన్ స్టోర్స్ సిరీస్‌లో ముల్లా పాత్రను పోషించి ఎంతో పేరు తెచ్చుకున్న నటి చిత్ర ఆత్మహత్య చేసుకున్నారు. నటిగా, టీవీ ప్రెజెంటర్ గా పాపులర్ అయినా ఈ అమ్మాయి వయసు కేవలం 28 సంవత్సరాలు. అంతేనా… ఆమె డ్యాన్సర్, మోడల్ కూడా.
సన్ టీవీలో ప్రసారమైన లిటిల్ డాడీ, బిగ్ డాడీ సిరీస్‌లో నటించారావిడ. సినిమాలు కూడా చేశారు. చిత్ర డ్యాన్స్‌కు ప్రత్యేక అభిమాన వర్గం ఉంది. ఎదుగుతున్న అమ్మాయి, అవకాశాలతో దూసుకుపోతున్న అమ్మాయి… సడెన్ గా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. పైగా ఆమె ఇటీవలే ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఆత్మహత్య అందరికీ ఆశ్చర్యం, విస్మయం కలిగించింది. ఇదొక అంతుచిక్కని ఆత్మహత్యగా అనుకోవచ్చు. ఎందుకంటే అనుమానించదగిన పరిస్థితులే కనిపించడం లేదు.
తన కాబోయే భర్తతో ఒక హోటల్ గదిలో ఉండి షూటింగ్‌కు హాజరవుతున్న చిత్ర అదే రూంలోని బాత్ రూంలో ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయింది. ఆ సమయంలో కాబోయే భర్త హేమంత్ అదే రూంలో ఉన్నారు. బాత్ రూం నుంచి ఎంతసేపటికీ రాకపోవడం, పిలిచినా పలకకపోవడంతో హేమంత్ హోటల్ మేనేజ్మెంట్ నుండి డూప్లీకేట్ కీ తీసుకొని తలుపు తెరిచాడు. ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతుండడం చూసి.. హేమంత్ షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.