సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు. 2005లో ఓ హిందీ మూవీతో సినీరంగ ప్రవేశం చేసిన ఈ భామ.. తనదైన టాలెంట్, గ్లామర్ షోతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
ఇండస్ట్రీలోకి వచ్చి 17 ఏళ్లు అవుతున్నా.. ఇంకా ఈ బ్యూటీ వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది. అయితే ఆమె సక్సెస్ గ్రాఫ్ అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం తమన్నా `ఎఫ్ 3` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతోంది.
వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా సత్తా చాటుతున్న అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా.. వారి సరసన తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేశారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.
బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమైన `ఎఫ్ 2`కు సీక్వెల్ గా రూపుదిద్దుకున్న `ఎఫ్ 3` మే 27న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వెంకీ, వరుణ్, అనిల్ రావిపూడిలు వరుస ఇంటర్వ్యూలతో పాటు టీవీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. మెహ్రీన్, సోనాల్, సునీల్ లు సైతం ప్రమోషన్స్ లో భాగం అవుతున్నారు.
అయితే, వెంకీకి జోడీగా నటించిన తమన్నా మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. మొన్నటివరకు తమన్నా కేన్స్ లో బిజీగా గడిపింది. ఇది ఒక కారణం కావచ్చు. కానీ, కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ముగిసిన తర్వాత కూడా తమన్నా ఎఫ్ 3 ప్రచార కార్యక్రమాల్లో యాక్టివ్ అవ్వలేదు. కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా రాలేదు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ముగిసిన వెంటనే మిల్కీ బ్యూటీ థాయ్‌లాండ్ చెక్కేసి.. అక్కడ వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తోంది.
దీంతో తమన్నా ఎఫ్ 3 విషయంలో హర్ట్ అయిందని.. అందుకే ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటోందంటూ ఓ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. అసలింతకీ తమన్నా అలకకు కారణం ఏంటా అని నెటిజన్లు ఆరా తీయగా.. ఎఫ్3 లో సోనాల్ చౌహన్ పాత్రకి అనిల్ రావిపూడి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారట. దాంతో తమన్నా పాత్ర కాస్త తగ్గిందట. అందుకే మిల్కీ బ్యూటీ అలిగిందని.. ప్రమోషన్స్ లో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తోందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.