స్టార్ హీరోయిన్ తమన్నా వయసిప్పుడు 31 ఏళ్లు. ఐతే వయసు తక్కువగా అనిపించొచ్చు కానీ.. ఇండస్ట్రీలో ఆమె అనుభవం 17 ఏళ్లు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. 14-15 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా అరంగేట్రం చేసిన ఆమె.. టీనేజీలోనే స్టార్ హీరోయిన్ అయింది. పుష్కరానికి పైగా టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతూ వస్తోంది.
సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ ఆమె భారీ చిత్రాల్లో నటించింది. ఐతే ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఏదో ఒక దశలో తిరోగమన దిశలో పయనించాల్సిందే. తమన్నా కూడా అందుకు మినహాయింపు కాదు. గత కొన్నేళ్లలో ఆమె జోరు బాగా తగ్గింది. ఇప్పుడు భారీ చిత్రాల్లో ఆమెకు ఛాన్సులు రావట్లేదు. ఎఫ్-3, సీటీమార్, మేస్ట్రో, గుర్తుందా శీతాకాలం లాంటి మీడియం-చిన్న స్థాయి సినిమాలకు పడిపోయింది తమ్మూ. చూస్తుంటే ఆమె సినీ కెరీర్ ఇంకెంతో కాలం కొనసాగేలా కనిపించడం లేదు.
ఐతే సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్నపుడే ట్రెండుకు తగ్గట్లుగా అడుగులు వేస్తోంది మిల్కీ బ్యూటీ. నెమ్మదిగా ఆమె దృష్టి వెబ్ సిరీస్‌లు, టీవీ షోల మీదికి మళ్లుతోంది. ఆహా కోసం ఒక టాక్ షో చేయడంతో పాటు ‘లెవెంత్ అవర్’ అనే వెబ్ సిరీస్‌లోనూ తమన్నా నటించిన సంగతి తెలిసిందే. ఇవి ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా హాట్ స్టార్‌లో ప్రసారమైన ‘నవంబర్ స్టోరీ’తో తమ్మూ సత్తా చాటింది.
త్వరలో ఆహా కోసం ఆమె మరో వెబ్ సిరీస్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఒక ఆసక్తికర టీవీ షోను హోస్ట్ చేయబోతోంది తమన్నా. ఆస్ట్రేలియాలో మొదలై.. వివిధ దేశాలకు విస్తరించి అన్ని చోట్లా అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్న ‘మాస్టర్ చెఫ్’ ప్రోగ్రాం తెలుగు వెర్షన్‌ను తమన్నానే హోస్ట్ చేయబోతుండటం విశేషం.
ఈ ప్రోగ్రాంను వేరే భాషల్లో చాలా వరకు మేల్ ఆర్టిస్టులు హోస్ట్ చేయగా.. తెలుగులో మాత్రం తమన్నాను ఎంచుకున్నారు. జెమిని టీవీలో ఈ షో ప్రసారం కాబోతోంది. ఓవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ.. ఇంకో వైపు టీవీ షోల హోస్టింగ్లోకి అడుగు పెడుతున్న తమన్నా మున్ముందు తన కెరీర్‌కు ఢోకా లేకుండా చూసుకుంటున్నట్లే ఉంది.