ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల మారణ హోమం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. తమ దేశం నుంచి అమెరికా బలగాలు పూర్తిగా వెనుదిరగక ముందే తాలిబన్ల అరాచకం మొదలు కావడం కలకలం రేపింది. ఇక, నిన్న అమెరికాకు చెందిన చిట్ట చివరి సైనికుడు కూడా వెళ్లిపోవడంతో తాలిబన్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆఫ్టన్ ప్రభుత్వానికి, అమెరికా సైన్యానికి మద్దతిచ్చిన వారిని తాలిబన్లు టార్గెట్ చేస్తున్నారు.
ఆ మద్దతుదారులు మర్యాదగా తమ కోర్టులో లొంగిపోవాలని, లేకుంటే వెతికి మరీ చంపేస్తామని బెదిరింపు లేఖలను బహిరంగ ప్రాంతాల్లో, కొన్ని ఇళ్ల తలుపులపై అంటించి వెళుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తాలిబన్ల అమానుష చర్య ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ వ్యక్తిని హెలికాప్టర్ కు వేలాడదీసిన తాలిబన్లు…నగరమంతా చక్కర్లు కొట్టిన వీడియో ప్రపంచాన్ని కలచివేస్తోంది. అమెరికా వదిలి వెళ్లిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ కు ఆ వ్యక్తిని వేలాడదీస్తూ కాందహార్ మీదుగా తాలిబన్లు ఎగురుతూ వెళ్లిన దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి.
అయితే, హెలికాప్టర్‌కు తాడుతో వేలాడుతున్న వ్యక్తి సజీవంగా ఉన్నాడా? లేక మరణించాడా అన్న విషయం వీడియోలో స్పష్టంగా కనిపించలేదు. కానీ, చంపేసిన వ్యక్తినే తాలిబన్లు వేలాడదీస్తూ పైశాచికానందం పొందారని స్థానికులు చెబుతున్నారు. అమెరికాకు సాయం చేసిన వారు స్వచ్ఛందంగా తమకు లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేస్తూ, ప్రజల్లో భయం పుట్టేలా ఇలా చేశారని కొందరు అంటున్నారు. అయితే, తమ ఎయిర్ ఫోర్స్.. ప్రస్తుతం ఇస్లామిక్ ఎమిరేట్స్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లు కాందహార్ నగరం మీదుగా పెట్రోలింగ్ చేస్తున్నాయని తాలిబ్ టైమ్స్ ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ వచ్చింది.
అయితే, తాజాగా ఈ వైరల్ వీడియోపై ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ వివరణనిచ్చింది. హెలికాప్టర్ కు వేలాడుతున్న వ్యక్తి తాలిబన్ ఫైటర్ అని, గవర్నర్ ఆఫీసుపై తాలిబన్ల జెండా ఎగరేసేందుకు అతడు ప్రయత్నించి విఫలమయ్యాడని క్లారిటీనిచ్చింది. దీంతో, ఈ వీడియోను తొలుత ట్వీట్ చేసి…అది వైరల్ అయ్యేందుకు కారణమైన అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనేటర్ టెడ్ క్రూజ్ ఆ వీడియోను డిలీట్ చేశారు.