ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు వ్యవహారం పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారింది. మంత్రి పేర్ని నాని వర్సెస్ వర్మ ఎపిసోడ్ తో ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని సినిమా థియేటర్ల సమస్యలపై మంత్రులతో తాను మాట్లాడతానని తలసాని అన్నారు.
అఖండ, పుష్ప మూవీ మంచి విజయాలు సాధించాయని, దీంతో, సినీ పరిశ్రమ మళ్లీ పుంజుకుందని తలసాని అన్నారు. తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచామని, ఐదో షోకు కూడా అనుమతులిచ్చామని చెప్పారు. సినీ పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నామన్నారు. సినిమా కేవలం వినోదాన్ని అందించే సాధనమే అని చెప్పారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్ గా ఉండాలనుకుంటున్నామని, సినిమాకు కులం, మతం, ప్రాంతాల భేదాలు ఏవీ ఉండవని హితవు పలికారు.
టాలీవుడ్ కు చంద్రబాబు, చంద్రబాబుకు మద్దతుందని వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్ల నేపథ్యంలో తలసాని వ్యాఖ్యాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హైదరాబాద్లో సినీ పరిశ్రమపై వేలాది మంది బతుకుతున్నారని, తాము వారిపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోమని అన్నారు. థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు పెట్టబోమని తలసాని చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాత్రం నిబంధనలను తప్పవన్నారు. మరి, తలసాని కామెంట్లపై ఏపీ మంత్రుల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. అయినా, పక్క రాష్ట్రం మంత్రి వచ్చి చెప్పే స్థాయికి ఏపీ మంత్రుల ఆలోచన ఉందంటూ విమర్శలు వస్తున్నాయి.