హీరోగా మారిన బాల నటుడు తేజ సజ్జ ఇప్పటిదాకా లీడ్ రోల్ చేసినవి చిన్న సినిమాలే. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఇప్పటిదాకా చేసినవి చిన్న చిత్రాలే. వీళ్ళిద్దరి కలయికలో మొదలైన హనుమాన్ ను చిన్న సినిమా అనే అందరూ అనుకున్నారు. ఇలాంటి సినిమాను సంక్రాంతి బరిలో నిలపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ పండక్కి మామూలుగా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. వచ్చే సంక్రాంతికి కూడా గుంటూరు కారం సహా పెద్ద సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి.
అయినా సరే హనుమాన్.. గుంటూరు కారం రిలీజ్ అయ్యే జనవరి 12నే విడుదలకు సై అంది. అయితే ముందు డేట్ అయితే ఇచ్చారు కానీ చివరికి ఈ సినిమా వాయిదా పడడం అనివార్యం అనుకున్నారు చాలామంది. కానీ పట్టుబట్టి సంక్రాంతికి రాబోతోంది హనుమాన్. ఇంతకుముందు రిలీజ్ అయిన టీజర్ తోనే ఆశ్చర్యపరిచిన హనుమాన్ ఇప్పుడు ట్రైలర్ తో ప్రేక్షకులనే కాక ఇండస్ట్రీ వర్గాలను కూడా షాక్ కు గురిచేసింది. ఇది జస్ట్ ట్రైలర్ లాగా కాకుండా.. సంక్రాంతికి రిలీజ్ అయ్యే మిగతా చిత్రాలకు ఒక వార్నింగ్ లాగా అనిపించింది.
దీన్ని ఇంకెంత మాత్రం చిన్న సినిమాగా పరిగణించడానికి వీలులేదని టైలర్ చూస్తే అర్థమైంది. ఒక పెద్ద సినిమా రేంజ్ లో బలమైన కంటెంట్ తోనే రాబోతోంది హనుమాన్ అన్నది స్పష్టం. ఇందులో హీరో చిన్నవాడే కానీ.. కథ మొత్తం తిరిగే హనుమాన్ పాత్ర స్టార్ హీరో రేంజికి తగ్గనిదే. తెలుగు ప్రేక్షకులు అనే కాక ఇండియా మొత్తం ఆడియన్స్ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఇది.
కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో హనుమాన్ సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలను కొట్టి పారేయలేం. సంక్రాంతికి రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలకు ఈ చిత్రం గట్టి పోటీనే ఇచ్చేలాగా కనిపిస్తోంది. కాబట్టి హనుమాన్ ను తక్కువ అంచనా వేస్తే ప్రమాదమే.