తెలంగాణలో ఎన్నికల ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచుతోంది. ఓ వైపు బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓటు బ్యాంకు చీలకూడదనే ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్.. మరోవైపు త్రిముఖ వ్యూహంతో ప్రచారాన్ని పరుగులు పెట్టించాలని చూస్తోంది. అగ్ర నాయకులతో రాష్ట్రంలో బహిరంగ సభలు, హామీలపై అగ్ర నేతలతో డిక్లరేషన్లు, రాష్ట్ర ముఖ్య నేతలతో బస్సు యాత్రలు నిర్వహించాలని భావిస్తోంది.
తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పార్టీ ప్రచార కర్త సునీల్ కనుగోలుతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే త్రిముఖ వ్యూహంతో రాబోయే వంద రోజుల ప్రచారాన్ని హోరెత్తించాలని టీపీసీసీ నిర్ణయించింది. అగ్రనేతలతో భారీ సభల నిర్వహణ, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఇవ్వాల్సిన హామీలపై డిక్లరేషన్, రాష్ట్ర ముఖ్య నేతల బస్సు యాత్ర.. ఇలా మూడు అంశాలపై పీసీసీ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ అంశాలను ఆచరణలో పెట్టేందుకు వీలుగా ఉప కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ నెల 30న కొల్లాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ఈ సభతోనే ప్రచార జోరును మరింత పెంచాలని టీపీసీసీ చూస్తోంది. అలాగే వచ్చే నెల 15న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గర్జన సభను ఏర్పాటు చేసేందుకు టీపీసీసీ కసరత్తులు చేస్తోంది. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రకటించే హామీలపై ఈ అగ్ర నాయకులతో డిక్లరేషన్ ఇప్పించే అవకాశం ఉంది. అందుకే ఈ హామీలను రూపొందించడానికి ఉప కమిటీ ఏర్పాటు చేయబోతుంది. మరోవైపు రాష్ట్ర ముఖ్య నేతల బస్సు యాత్ర రూట్ మ్యాప్‌ను తయారు చేయడానికి కూడా ఓ ఉప కమిటీని టీపీసీసీ ఏర్పాటు చేయబోతుంది.