ఇటీవల వార్తల్లోకి వచ్చిన అతి చిన్న ముస్లిం దేశం సిరియా. ఇక్కడి అధ్యక్షుడు బషర్ అల్ అసద్ చేసిన అకృత్యాలు.. సాగించి న పాలనపై వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశం విడిచి ఆయన రష్యాకు పారిపోయారు. దేశాన్ని సిరియా రెబల్ నాయకుడు జులానీ నేతృత్వంలో తిరుగుబాటు దారులు తమ అధీనంలోకి తీసుకున్నాయి. దీంతో అసద్ దేశాన్ని విడిచి పారిపోయారు. ఇక, తిరుగుబాటు దారులు గత పాలనలో జరిగిన అకృత్యాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువస్తున్నారు. అప్పటి అధ్యక్షుడు అసద్‌కు నమ్మిన బంటుగా ఉన్న ఇంటెలిజన్స్ చీఫ్ తలాల్ దక్కాక్ చేసిన అనేక ఘోరాలను ఇప్పుడు బయటకు తీశారు.
ప్రధానంగా అసద్‌ను వ్యతిరేకించిన ప్రతిపక్షాల సభ్యులను, ప్రభుత్వాన్ని విమర్శించే ప్రజలను తన అధీనంలోకి తీసుకున్న దక్కాక్.. నేరుగా తానే శిక్షలు విధించినట్టు తిరుగుబాటు దారులు వెల్లడించారు.అసద్‌ను వ్యతిరేకించిన వారిని.. తన పెంపుడు సింహానికి ఆహారంగా వేసినట్టు ఆధారాలతో సహా వెల్లడించడం గమనార్హం. “దక్కాక్ క్రూరుడు. ప్రభుత్వాన్ని విమర్శించిన వారిని యుద్ధ ఖైదీలుగా పేర్కొనేవాడు. వీరిని నేరుగా తీసుకెళ్లి తన పెంపుడు సింహానికి ఆహారంగా వేసేవాడు. అసద్ ఎదురు తిరిగిన వారందరికీ ఇదే శిక్ష విధించాడు“ అని ఓ ప్రకటనలో వెల్లడించారు.
బహిరంగ ఉరి!
ప్రజలను, ప్రతిపక్ష నాయకులను కూడా.. సింహానికి ఆహారంగా వేసిన దక్కాక్‌ను బహిరంగంగా ఉరి తీసినట్టు తిరుగుబాటు దారులు ప్రకటించుకున్నారు. “దక్కాక్‌ను సిరియా పశ్చిమ ప్రాంతంలోని హమా పట్టణంలో బహిరంగంగా ఉరితీశాం. ఆయన చేసిన క్రూర నేరాలపై విచారణ అవసరం లేదు. శిక్ష విధించడమే సరైన చర్య“ అని తిరుగుబాటు దారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే.. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. దక్కాక్కు 1500 మంది వ్యక్తిగత సైన్యం ఉందని పేర్కొన్నారు. తన ఇంట్లోనే ఓ సింహాన్ని పెంచుకునేవాడని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని గుర్తించి.. దానికి ఆహారంగా వేసినట్టు ఆధారాలు ఉన్నాయని ప్రకటనలో తిరుగుబాటు దారులు వివరించడం గమనార్హం.