గడిచిన కొద్దిరోజులుగా మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది విశాఖ శారదా పీఠాధిపతి స్వాములోరి పుట్టినరోజు వ్యవహారం. తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఏపీలోని అన్ని ప్రముఖ దేవాలయాలు.. ధార్మిక సంస్థలు తగిన కానుకలు చెల్లించి.. స్వాములోరి ఆశీస్సులు పొందాలంటూ శారదా పీఠం కోరటం.. అందుకు తగ్గట్లే దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేయటం తెలిసిందే.
ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు రావటం..ఒకరైతే హైకోర్టును ఆశ్రయించటం తెలిసిందే. దీంతో.. స్వాములోరి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించాలనుకున్నకార్యక్రమంపై శారదా పీఠం కోర్టుకు వివరణ ఇస్తూ.. తాము పేర్కొన్న ఆశీస్సుల వ్యవహారాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో.. సాములోరి ఆశీస్సులపై ఏపీ దేవాదాయ శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు వెనక్కి వెళ్లిపోయాయి. ఇక్కడితో ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లైంది.
ఇదిలా ఉంటే.. ఈ రోజు శారదాపీఠం సాములోరి పుట్టినరోజు. ఈ రోజున భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని తొలుత అనుకున్నా తర్వాత వెనక్కి తగ్గారు. ఆశీస్సుల వ్యవహారం వివాదం కావటంతో ఈ ఎపిసోడ్ తర్వాత నుంచి ఏపీ దేవాదాయ శాఖకు చెందిన అధికారులు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు సాములోరి పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను కలిసేందుకు ఏ ఒక్క అధికారి రాకపోవటం గమనార్హం.
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు.. ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ లు శారదా పీఠాన్ని సందర్శించి.. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి సాధారణ భక్తులు భారీగా వస్తారని ఆశించినా.. అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందంటున్నారు. మొత్తానికి లేఖ రాయడం ద్వారా భారీగా అనుకున్న పుట్టినరోజు వేడుకలు కాస్తా.. ప్రతి ఏటా జరిగినట్లు కూడా జరగకపోవడం, స్వరూపానంద ఇమేజ్ జనాల్లో దిగజారడం గమనార్హం.