మాన్సాస్ ట్రస్టు చైర్మన్ అశోక్ గజపతిరాజుపై ఏపీ సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అశోక గజపతిరాజుపై కక్ష సాధించేందుకే కుటుంబంలో కలతలు రేపి సంచయిత గజపతిరాజును తెరపైకి తెచ్చారని ఆరోపణలు వచ్చాయి. చివరకు కోర్టు జోక్యంతో అశోక గజపతి రాజు తిరిగి మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడం, సంచయిత నియామకం చెల్లదంటూ తీర్పునివ్వడంతో వైసీపీకి షాక్ తగిలింది.
ఇక, ఏ దారి లేకపోవడంతో అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయి ఇష్టం వచ్చినట్లు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లీగల్ గా అశోక్ గజపతి రాజును ఎదుర్కోవడంలో విఫలమవడంతో…తమ అధికారాన్ని ఉపయోగించి వేరేరకంగా కక్ష సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విజయసాయిపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సింహాచలం పుణ్యక్షేత్రంలో పూర్ణకుంభంతో స్వాగతం స్వీకరించే అర్హత విజయసాయిరెడ్డికి లేదని, అలా స్వాగతం ఇవ్వడాన్ని ఖండిస్తున్నానని శ్రీనివాసానంద షాకింగ్ కామెంట్లు చేశారు. కోర్టు తీర్పు తర్వాత మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ హోదాలో సింహాచలానికి వచ్చిన అశోక్ గజపతి రాజుకు పూర్ణకుంభ స్వాగతం పలకకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ట్రస్టు చైర్మన్ గా అన్ని అర్హతలున్న అశోక్ గజపతి రాజుకు దక్కని పూర్ణకుంభ స్వాగతం అనర్హులైన విజయసాయిరెడ్డికి దక్కడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఎవరికి పూర్ణకుంభ స్వాగతం ఇవ్వాలో.. ఎవరికి ఇవ్వకూడదో తెలియదా అని శ్రీనివాసానంద సరస్వతి నిలదీశారు. ఈ రోజు సింహాచలం ఆలయంలో అర్హత లేని వారికి పూర్ణకుంభ స్వాగతం పలికితే, తర్వాత రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఇదే పద్ధతి మొదలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఈవో, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసమర్ధ దేవాదాయశాఖ మంత్రి వల్లే అపచారాలు జరుగుతున్నాయని శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు.