టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిన నేపథ్యంలో మూడు పార్టీల నుంచి టికెట్ ఆశించిన పలువురికి నిరాశ తప్పులేదు. ఈ క్రమంలోనే కొందరు పార్టీలు మారుతుండగా మరికొందరు ఇండిపెండెంట్ గానైనా బరిలోకి దిగి తమ సత్తా చాటుతామని చెప్తున్నారు. ఈ కోవలోకే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్రీ పీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద స్వామి చేరారు. హిందూపురం ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలలో ఒకటి ఆశించి భంగపడ్డ పరిపూర్ణానంద..అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
హిందూపురం నుంచి తాను పోటీ చేస్తానని పొత్తులకు ముందే బీజేపీ అధిష్టానానికి చెప్పానని ఆయన గుర్తు చేశారు. దక్షిణాదిన హిందూపురం ముఖ్యమైన ప్రాంతమని, ఆ ఊరి పేరులోనే హిందూ ఉందని చెప్పుకొచ్చారు. ఇచ్చిన మాటకు తాను కట్టుబడతానని, అందుకే టికెట్ విషయంలో బీజేపీ అధిష్టానం పునరాలోచించకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు.
అయితే, హిందూపురం సీటును పరిపూర్ణానందకు ఇస్తే ముస్లిం ఓటర్లు దూరమవుతారని కొందరు బీజేపీ నేతలు భావించి తనకు టికెట్ రాకుండా చేశారని తెలుస్తోంది. ఆ క్రమంలోనే పరిపూర్ణానంద తిరుగుబాటు బావుటా ఎగురవేశారని తెలుస్తోంది. గత ఏడాది కాలంగా బీజేపీకి మద్దతుగా ఆయన నిలిచిన సంగతి తెలిసిందే. మరి, పరిపూర్ణానంద ప్రకటనపై బీజేపీ అధిష్టానం స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. పొత్తుల్లో భాగంగా హిందూపురం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు టీడీపీకి దక్కిన సంగతి తెలిసిందే.