ఏపీ సీఎం జగన్ పై శనివారం రాత్రి విజయవాడ శివారు ప్రాంతం సింగ్‌నగర్‌లో జరిగిన రాయి దాడి ఘటన పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఇక, ప్రధాని మోడీ నుంచి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు దీనిపై స్పందించారు. ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించారు. ఇక, రాష్ట్ర పోలీసులు సీఎం జగన్‌కు కల్పిస్తున్న అసాధారణ భద్రత గురించి అందరికీ తెలిసిందే. ఆయన పర్యటిస్తున్న ప్రాంతాల్లో ముందుగానే షాపులు మూసేయడం.. చెట్లు నరికేయడం.. ట్రాఫిక్‌ను కిలో మీటర్ల కొద్దీ దారి మళ్లించడం అందరికీ తెలిసినవే.
అయినప్పటికీ ఈ రాయి దాడి ఎలా జరిగిందనేది అందరిని విస్మయానికి గురి చేస్తున్న విషయం. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం హుటాహుటిన ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. అదేసమ యంలో రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా.. క్షేత్రస్థాయిలో పర్యటించారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి సైతం.. క్షేత్రస్థాయిలో అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. ఆయన కూడా క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఈ ఘటన ఆకతాయి చేశాడా? లేక.. ఉద్దేశ పూర్వకంగా జరిగిందా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
అదేవిధంగా రాళ్లు పడిన ప్రాంతంపైనా అనుమానాలు ఉన్నాయి. కుడివైపు నుంచి రాయి విసిరితే.. ఎడమ వైపు కంటి పైభాగానికి తగిలినట్టు వీడియోల్లో కనిపిస్తోంది. కానీ, సాక్షులు చెబుతున్న వివరణ ప్రకారం.. ఎడమవైపు నుంచి రాయి వచ్చి పడిందని తెలుస్తోంది. దీంతో రాయి ఎటు నుంచి తగిలింది? ఎలా వచ్చి తగిలిందనేది ఇప్పుడు పోలీసులకు కఠిన పరీక్షగా మారింది. సీన్ రీక్రియేట్ చేసేందుకు.. కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై సిట్ వేసేందుకు సీఎస్ ఎన్నికల సంఘాన్ని పర్మిషన్ కోరారు. మొత్తానికి రాయిదాడి ఘటన మలుపులు తిరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.