పార్టీ నుంచి సస్పెండ్ అయినా ప్రజా ప్రతినిధి.. పార్టీ అధినేత నిర్వహించే కార్యక్రమానికి హాజరు కావటమా? సాధారణంగా ఇలాంటివి ఎలా సాధ్యమని ప్రశ్నిస్తారు. కానీ.. ఏమైనా సాధ్యమయ్యేట్లుగా వ్యవహరించే విషయంలో జగన్ సర్కారు ముందు ఉంటుంది. తీవ్రమైన ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండ్ వేటు వేయించుకున్నప్పటికీ.. తాజాగా తాడేపల్లిలో జరిగిన అధికార పార్టీ విస్త్రత సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
తన వద్ద డ్రైవర్ గా పని చేసే దళిత యువకుడ్ని దారుణంగా హత్య చేసి.. డోర్ డెలివరీ చేసిన వైనం ఏపీ వ్యాప్తంగా పెను దుమారానికి కారణమైంది. ఈ ఉదంతంలో ఎమ్మెల్సీ అనంతబాబు మీద తీవ్రమైన ఆరోపణలు.. విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసులో జైలుకు వెళ్లిన ఆయన తర్వాత బెయిల్ మీద బయటకు రావటం తెలిసిందే. ఈ ఉదంతం చోటు చేసుకున్న నాలుగు రోజులకు పెద్ద ఎత్తున సంచలనంగా మారటంతో ఆయన్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు.
సాధారణంగా పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారు.. తర్వాత రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం ఉండదు. కానీ.. అనంతబాబు రూటు సపరేటు. ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసినా.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా సభలకు.. కార్యక్రమాలకు హాజరవుతుండటం చూస్తున్నదే. మొన్నటికి మొన్న నెలలో కూనవరంలో వరద ప్రాంతాల్ని పరిశీలించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రితో పాటు.. అదే వేదిక మీద దర్శనమిచ్చిన అనంతబాబు.. తాజాగా సీఎంవోలో జరిగిన కార్యక్రమానికి హాజరై.. అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. పార్టీ కార్యక్రమాలకు రావటం తప్పు కాదు కానీ.. సస్పెండ్ వేటు ను ఎత్తేసినట్లుగా ప్రకటించి ఉన్నా బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.