తెలుగు సినిమా చరిత్రలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థది ఒక ప్రత్యేక అధ్యాయం. ఈ బేనర్ మీద కరెన్సీ నోటు మీద కనిపించే ప్రతి భాషలోనూ సినిమాలు నిర్మించారు డాక్టర్ డి.రామానాయుడు. ఆయన ఘనవారసత్వాన్ని కొనసాగిస్తూ మంచి మంచి సినిమాలను నిర్మించి ఘనవిజయాలందుకుని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు సురేష్ బాబు. అలాంటి నిర్మాత ఈ మధ్య సినిమాల నిర్మాణం తగ్గించేశారు.
ఇప్పటికే నిర్మించిన చిత్రాలను థియేటర్లలో రిలీజ్ చేయడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. నారప్ప, దృశ్యం-2 లాంటి పెద్ద సినిమాలను ఆయన ఓటీటీలో రిలీజ్ చేసుకున్నారు. ఈ సంస్థలో తెరకెక్కిన మరో చిత్రం ‘విరాట పర్వం’ను కూడా ఓటీటీలోనేరిలీజ్ చేయడానికి ఆయన చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీని తర్వాత ఆయన కొత్తగా సినిమాల నిర్మాణమే చేపట్టట్లేదు. సురేష్ లాంటి పెద్ద నిర్మాత ఇలా మారిపోవడానికి కరోనాతో పాటు జగన్ సర్కారు కక్ష సాధింపు వైఖరే కారణం అన్నది సన్నిహితుల మాట.
కరోనా దెబ్బకు నిర్మాతల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తయారైంది. సినిమాలు నిర్మించడం ఒకెత్తయితే.. వాటిని థియేటర్లలో రిలీజ్ చేసి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టం మరో ఎత్తుగా మారింది. కొవిడ్ కష్టాలు చాలవని.. టికెట్ల ధరలు, ఇతర విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో సురేష్ బాబు విసుగెత్తిపోయినట్లే ఉన్నారు.
మిగతా నిర్మాతలు తమ సినిమాలను బయటపడేసేందుకు ఏపీ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఎన్నో విన్నపాలు చేశారు. అయినా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఐతే సురేష్ బాబు వారిలాగా తగ్గడానికి, ప్రభుత్వం ముందు చేతులు జోడించడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది.
విశాఖపట్నంలోని తన స్టూడియోను కూడా దెబ్బ తీయడానికి జగన్ సర్కారు ప్రయత్నాలు చేయగా.. ఆయన ధైర్యంగా పోరాటానికి సిద్ధమయ్యారే తప్ప జగన్ ముందు చేతులు కట్టుకుని నిలబడలేదు. ఇక టికెట్ల రేట్లు సహా వివిధ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని సినిమాలకు ఇబ్బందులు సృష్టిస్తుండటంతో ఎవరేమనుకున్నా సరే అని థియేటర్లలో తన సినిమాలను రిలీజ్ చేయడమే మానేసి ఓటీటీ బాట పట్టారాయన.
మరోవైపు సురేష్ కొత్తగా సినిమాల నిర్మాణం చేపట్టే విషయంలోనూ ఆసక్తిని ప్రదర్శించట్లేదు. ఉద్దేశపూర్వకంగా జగన్ సర్కారు సినీ రంగాన్ని ఇబ్బంది పెడుతుండటంతో ఆ ప్రభుత్వం దిగిపోయే వరకు సినిమాల నిర్మాణం జోలికి వెళ్లకూడదన్న ఆలోచనలో ఆయనున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల ఫలితాలను బట్టి ఆయన తదుపరి కార్యాచరణ ఉండేలా కనిపిస్తోంది. అప్పటి వరకైతే సురేష్ బాబు ఇండస్ట్రీలో ఉన్నా లేనట్లే.