టాలీవుడ్ నటి సురేఖా వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర లేదు. బ్రహ్మానందం, సురేఖా వాణిల కాంబినేషన్లో వచ్చిన ఎన్నో కామెడీ ట్రాక్ లు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఇటీవలి కాలంలో సురేఖా వాణి పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. దీంతో, ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేశారని, నటించడం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే, తాజాగా దసరా సందర్భంగా విడుదలైన స్వాతి ముత్యం సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో సురేఖా వాణి నటించారు.
గాడ్ ఫాదర్, ఘోస్ట్ చిత్రాలకు పోటీగా విడుదలైన ఈ చిత్రం హిలేరియస్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ చిత్ర సక్సెస్ మీట్ సందర్భంగా మాట్లాడిన సురేఖా వాణి…తాను నటించడం లేదన్న వార్తలపై స్పందించారు. ఈ సందర్భంగా తనకు అవకాశాలు రావడం లేదని, అందుకే నటించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను నటించాలని చాలామంది అడుగుతున్నారని, కానీ, అవకాశాలు తనదాకా వస్తేనే కదా నటించేది అంటూ సురేఖా వాణి చేసిన హాట్ కామెంట్స్ వైరల్ అయ్యాయి.
స్వాతిముత్యం దర్శకుడు లక్ష్మణ్ తనను దృష్టిలో ఉంచుకొని ఈ క్యారెక్టర్ రాశారని, అందుకు ఆయనకు ధన్యవాదాలని చెప్పారు. తనకు నటించడం ఇష్టమని, నటించేందుకు వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోబోనని సురేఖా వాణి చెప్పారు. అయితే, ఇటీవల తన కూతురు సుప్రీతతో కలిసి సురేఖా వాణి చేస్తున్న వీడియోలు ట్రోలింగ్ కు గురి కావడం, ట్రోలర్స్ పై సురేఖా వాణితోపాటు సుప్రీత కూడా ఘాటుగా స్పందించడం తెలిసిందే. ఈ క్రమంలోనే సురేఖా వాణికి అవకాశాలు తగ్గాయన్న పుకార్లు వినిపిస్తున్నాయి. అందుకే, తాను నటించడానికి సిద్ధమని సురేఖా ఈ వేదిక ద్వారా చెప్పారని టాక్ వస్తోంది. ఏది ఏమైనా…సురేఖా వాణి మాట్లాడిన ఈ వీడియో వైరల్ అయింది.