హైదరాబాద్ లోని మణికొండ జాగీర్ భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డుకు మధ్య చాలా ఏళ్లుగా వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ల్యాంకోహిల్స్లో నిర్మాణాలు జరుగుతున్న1654.32 ఎకరాల భూమి తమదేనంటూ వక్ఫ్ బోర్డు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో, వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే, ఆ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆ 1654.32 ఎకరాల భూమి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని దేశపు అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
సుప్రీం తాజా తీర్పుతో 1,654.32 ఎకరాలపై కేసీఆర్ సర్కార్ కు సర్వ హక్కులు దక్కనున్నాయి. ఈ సందర్భంగా మొత్తం 156 పేజీల తీర్పును సుప్రీం కోర్టు వెలువరించింది.
దర్గా హజ్రత్ హుస్సేన్ షా వలి అని పిలిచే దర్గాకు మొత్తం 1,654.32 ఎకరాలను ప్రకటిస్తూ 2006లో వక్ఫ్ బోర్డు జారీచేసిన ఎర్రాటా నోటిఫికేషన్ వివాదంగా మారింది. అక్కడ కేవలం ఒక ఎకరం మాత్రమే దర్గాకు ఉందని తెలంగాణ సర్కార్ చెబుతోంది. ఆ 1654.32 ఎకరాలు తమదేనంటూ దర్గా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో కూడా వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే, తాజాగా సుప్రీం కోర్టులో తీర్పు అనుకూలంగా రావడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది.