ఏపీలో కొద్ది నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం మొదలు తిరిగి ఎస్ఈసీగా నిమ్మగడ్డ బాధ్యతలు చేపట్టడం వరకు ఏపీలో పొలిటికల్ హై డ్రామా నడిచింది. ఓ పక్క భౌతిక దూరం పాటిస్తూ పాఠశాలలు, కళాశాలలు తెరిచేందుకు అనుమతిచ్చిన ఏపీ సర్కార్…స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మాత్రం కరోనాను సాకుగా చూపుతోంది. టెక్నికల్ గా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు కాలేదు.
ఇదిలా ఉండగా తాజాగా ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలకు, స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికలకు ముడిపెడుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ఎస్ఈసీ అనుమతి తప్పనిసరని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో లేనందున ఈసీ అనుమతి అవసరం లేదన్న ప్రభుత్వ వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
ఏపీలో ఎన్నికలు వాయిదా పడ్డాయని, రద్దు కాలేదని ఈసీ చేసిన వాదనతో సుప్రీం ఏకీభవించింది. ఏపీలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఈసీ అనుమతి తప్పనిసరని సుప్రీం అభిప్రాయపడింది. స్థానిక ఎన్నికల విషయంలో ఈసీ ఆదేశాలను సవరించాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీం విచారణ జరిపింది. ఏపీలో అభివృద్ధి పనుల ప్రారంభానికి ఈసీ అనుమతి తీసుకోవాలన్న ఆదేశాన్ని సవరించాలని ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు.
ఏపీలో ఎన్నికల కోడ్ కూడా అమల్లో లేదని, కాబట్టి ఈసీ అనుమతి అవసరం లేదని రోహత్గి ధర్మాసనానికి నివేదించారు. అయితే, ఏదైనా అభివృద్ధి పనులను ఈసీ ఆపిందా అని సుప్రీంకోర్టు సీజేఐ ప్రశ్నించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేయలేదని, కేవలం వాయిదా మాత్రమే వేశామని ఈసీ తరపు న్యాయవాది పరమేశ్వర్ తెలిపారు.
దీంతో నిర్దిష్ట అభివృద్ధి పనులకు ఈసీ అనుమతికి దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఒకవేళ ఈసీ అనుమతి ఇవ్వకుంటే అప్లికేషన్ దాఖలు చేసుకోవాలని ప్రభుత్వానికి తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు 4 వారాలపాటు వాయిదా వేసింది.