జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 1 వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఏపీలో రహదారులపై రోడ్ షోలు, సభలు, సమావేశాలు నిర్వహించకుండా తెచ్చిన ఈ జీవోపై ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా మండిపడ్డాయి. ఈ క్రమంలోనే జగన్ నియంతృత్వ పోకడలను ప్రతిపక్ష నేతలంతా ముక్తకంఠంతో ఖండించారు. ఈ నేపథ్యంలోనే ఆ జీవోను రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గతంలో ఆశ్రయించారు.
దీంతో, ఆ జీవోను నిలిపివేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జీవో నంబర్1పై జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఆ తర్వాత ఈ వివాదాస్పద జీవోపై విచారణను ఏపీ హైకోర్టు ఈ ఏడాది జనవరిలో పూర్తి చేసింది. కానీ, తీర్పును మాత్రం రిజర్వ్ లో ఉంచింది.
దీంతో, జగన్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో ఇచ్చిన జీవో నెంబర్ ఒకటిని, హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన అంశంపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. జీవో నెంబర్ ఒకటిపై వీలైనంత త్వరగా తీర్పు వెలువరించాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ జీవోకు సంబంధించి దాఖలైన పిటిషన్లను త్వరగా పరిష్కరించాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది. వీలైనంత త్వరగా తీర్పు చెప్పాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.