ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి, దాని పనితీరు గురించి ఏ సమాచారమైనా పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది, ఉండాలి, ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి సున్నితమైన సమాచారాన్ని బయటి వారికి తెలియజేస్తు న్నారన్న కారణంతో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయటం ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవహారాలు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు, వాటికి సంబంధించిన వివాదాస్పద కార్పొరేషన్ల ఏర్పాటు- ప్రజలందరికీ తెలియాల్సిన అంశాలు. ప్రభుత్వం పారదర్శకతతో పని చేయాల్సిన అంశాలు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చెప్పేంతవరకు 41000 కోట్లు లెక్కా పత్రం లేకుండా ఖర్చు పెట్టారన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలియదు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చెప్పేంతవరకు భవిష్యత్తు మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి 25 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు అన్న విషయం ప్రజలకు తెలియదు. ఇంతకు ముందు అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ ఈ ప్రభుత్వం అప్పుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది. అందులో భాగమే ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్ర ప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్ర ప్రదేశ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్…. మొదలైనవి.
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ – వ్యయాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడిన తర్వాత కూడా, సంక్షోభ నివారణకు చర్యలు తీసుకోకుండా, ఆర్థిక సంక్షోభాన్ని మరింత పెంచే విధంగా అప్పులు చేయడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని గుర్తించిన బాధ్యతాయుతమైన కొంతమంది అధికారులు, తమ మిత్రులతో ఆ విషయాలు చర్చించి, రాబోయే ప్రమాదం గురించి హెచ్చరించి, అందర్నీ అప్రమత్తం చేశారని ప్రశంసించడం పోయి, క్రమశిక్షణ చర్యల పేరుతో సస్పెండ్ చేయడం అంటే ప్రభుత్వం మరో తప్పు చేయటమే.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గత వారం రోజుల్లో రెండు మూడు సార్లు మీడియా సమావేశంలో స్పష్టంగా ప్రకటించారు… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భయంకరంగా ఉంది అని. అలాగే ఆంధ్ర ప్రదేశ్ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తిరుమలలో దర్శనం అనంతరం మీడియాతో చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని.
అలాగే నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు అన్ని వివరాలతో ప్రధానమంత్రికి లేఖ రాశారు.
మొత్తం మీద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ప్రకటించిన వివరాలు, రఘురామకృష్ణంరాజు ప్రధానికి రాసిన వివరాల ఆధారంగా తెలుగు మీడియాలో వస్తున్న వార్తల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక అగాథం లోకి నెట్టు బడుతున్న విషయం ప్రపంచం మొత్తం తెలిసిపోయింది.
తన తప్పులను సవరించుకోవలసిన ప్రభుత్వం, తన సహజ ధోరణిలో, నిరంకుశంగా వ్యవహరిస్తుంది. ఈ విధానం రాష్ట్ర భవిష్యత్తుకు పెద్ద ప్రమాదం. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులందరూ, ఈ విషయాలపై తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలి. తోటి ఉద్యోగుల కు అండగా నిలవాలి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రక్షించే పని ఎవరు చేసినా అందరూ ముక్తకంఠంతో మద్దతు ఇవ్వాలి.
డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు.
రాష్ట్ర అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి