కాపాడాల్సిన కనుపాపలు కళ్లను దారుణంగా హతమారిస్తే? వినేందుకే విచిత్రంగా అనిపించినా.. ఇటీవల కాలంలో ఇలాంటి దారుణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటు చేసుకున్న ఒక ఉదంతం విన్నంతనే వణుకు పుట్టేలా చేస్తుంది.
అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన పిల్లల్ని.. తన చేతులతోనే దారుణంగా చంపేసిన వైనం షాకింగ్ గా మారింది. అలా అని తల్లి ఏమైనా చదువు సంధ్యా లేనిదా? అంటే అదేమీ కాదు. ఆమె పీజీలో గోల్డ్ మెడలిస్ట్. మదనపల్లిలోని ఒక విద్యా సంస్థకు ప్రిన్సిపల్ గా పని చేస్తున్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉండి.. ఇద్దరు కూతుళ్లను దారుణంగా చంపేసిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.
మదనపల్లి గ్రామీణ మండలం అంకిశెట్టి పల్లెలో పురుషోత్తం నాయుడు.. పద్మజలకు ఇద్దరు కుమార్తెలు. 27 అలేఖ్య.. 22 ఏళ్ల సాయి దివ్యలు ఉన్నారు. పెద్దమ్మాయి బోపాల్ లో పీజీ చేస్తుంటే.. చిన్నమ్మాయి బీబీఏ పూర్తి చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటున్నారు. గత ఆగస్టులో శివనగర్ లో నిర్మించుకున్న కొత్తింట్లోకి వచ్చారు. వీరింట్లో తరచూ పూజలు చేసేవారు.
ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించిన తర్వాత చిన్న కుమార్తెను శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్దమ్మాయి అలేఖ నోటిలో రాగి చెంబు పెట్టి.. డంబెల్ తో కొట్టి హతమార్చారు. ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తనతో కలిసి పని చేసే ఒక మాష్టారుకు చెప్పటం.. వారు ఇంటికి వచ్చి చూసి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతకీ వారెందుకిలా చేశారు? అన్నది ప్రశ్నగా మారింది.
అథ్యాత్మికత పేరుతో మూఢభక్తిని నిండుగా ఉండటం.. మంత్రతంత్రాలకు అలవాటు పడిన వారు.. తమ కుమార్తెలు మళ్లీ బతుకుతారన్న ఉద్దేశంతోనే అంత దారుణంగా చంపేసినట్లుగా వారిద్దరు ప్రాథమికంగా ఒప్పుకున్నారు. తన ఇద్దరు కుమార్తెల్ని తల్లే స్వయంగా చంపేయగా.. ఆ సమయంలో తండ్రి పురుషోత్తం నాయుడు అక్కడే ఉన్నట్లుగా తేలింది.
వారి మానసిక పరిస్థితి సరిగా లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత చదువులు చదివి.. కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు తల్లిదండ్రుడు పెద్దవాళ్లైన ఇద్దరు కుమార్తెల్ని దారుణంగా చంపేసిన వైనం ఇప్పుడు ఏ మాత్రం మింగుడుపడని పరిస్థితి.