ఎమ్మెల్యేకు.. మహిళా సర్పంచ్ కు మధ్య నడుస్తున్న వివాదం అంతకంతకూ ముదిరిపోవటమే కాదు.. పోలీసు స్టేషన్ లో కేసు వరకు వెళ్లటం తెలిసిందే. స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ జానకీపురం సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణ.. తదనంతర పరిణామాల ఇష్యూ ఇప్పుడో కొత్త మలుపు తిరిగింది. తాజాగా ఈ అంశంపై జాతీయ.. రాష్ట్ర మహిళా కమిషన్లు స్పందించి.. సుమోటోగా కేసును స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నాయి.
ఎమ్మెల్యే.. సర్పంచ్ మధ్య ఉన్న వివాదాన్ని కమిషన్లు స్వీకరించిన నేపథ్యంలో.. ఈ అంశంపై విచారణ చేపట్టి తమకు నివేదిక సమర్పించాల్సిందిగా పోలీసుశాఖకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో రాజయ్యపై చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాల్ని సమర్పించాల్సిందిగా సర్పంచ్ నవ్యను పోలీసులు కోరారు.
తమ గ్రామానికి సాయం చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యను కలిసిన నేపథ్యంలో.. తనపై లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపణలు చేయటం.. అవి కాస్తా సంచలనంగా మారటం తెలిసిందే. ఈ అంశంపై నవ్య ఇంటికి వెళ్లిన రాజయ్య విషయాల్ని మాట్లాడి.. సామరస్యపూర్వకంగా మాట్లాడుకున్నట్లుగా ఇరువర్గాలు పేర్కొన్నాయి. కట్ చేస్తే.. ఈ ఉదంతం జరిగిన మూడు నెలలకు మరోసారి సర్పంచ్ నవ్య తెర మీదకు వచ్చారు.
లైంగిక వేధింపుల ఆరోపణ సమయంలో తమ ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే రాజయ్య తమ గ్రామానికి రూ.25 లక్షల మొత్తాన్ని డెవలప్ మెంట్ కోసం ఇస్తామని చెప్పారని.. కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. నవ్య భర్త ప్రవీణ కు రూ.7 లక్షలు ఇచ్చారని.. మిగిలిన మొత్తాన్ని అడిగితే.. ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో పలు మలుపులు తిరిగిన ఈ వ్యవహారం తాజాగా నవ్య భర్త ప్రవీణ్.. ఒప్పందపత్రాన్ని తీసుకొచ్చి సంతకం చేయాలని కోరారు.
ఈ ఒత్తిళ్ల వేళ.. ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఎమ్మెల్యే రాజయ్యతో పాటు ఆయన సహాయకులు.. భర్త ప్రవీణ్ మీదా ఆమె పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో తనకు న్యాయం జరగకుంటే మహిళా కమిషన్ ను ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ అంశంపై జాతీయ.. రాష్ట్ర మహిళా కమిషన్లు స్పందించి.. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్నాయి. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించాయి.