ఏపీ సీఎం జగన్ ముఖంపై గత పది హేను రోజులుగా బ్యాండెయిడ్(స్టిక్కర్) ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఇది కనిపిస్తోంది. సభల్లోనూ సమావేశాల్లోనూ దీంతోనే ఆయన కనిపిస్తున్నారు. రెండు వారాల కిందట.. విజయవాడ శివారు లోని సింగ్ నగర్ ప్రాంతంలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఓ యువకుడు.. రాయి దాడి చేసిన విషయం తెలిసిందే. ఇది అప్పట్లో రాజకీయంగా కూడా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ దాడి చేసినట్టుగా భావిస్తున్న సతీష్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
కట్ చేస్తే.. సీఎం జగన్ తాజాగా పులివెందులలో పర్యటించారు. ఈ సందర్భంగా సభలోనూ ప్రసంగించారు. అయితే.. ఆయన నుదుటన బ్యాండ్ ఎయిడ్ ఉంది. దీనిని ప్రత్యేకంగా గమనించాల్సిన అవసరం లేదు. స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. దీనిని కార్నర్ చేస్తూ.. సీఎం జగన్ సోదరి, వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సీఎం గారూ ఆ స్టిక్కర్ తీసేయండి“ అని ఆమె సలహా ఇచ్చారు. అంతేకాదు.. ఇది తాను ఏదో ఉద్దేశ పూర్వకంగా చెబుతున్నది కాదని.. ఓ డాక్టర్‌గా తనకు ఉన్న అనుభవంతో చెబుతున్న మాటగా ఆమె వ్యాఖ్యానించారు.
“సీఎం జగన్ తలకు గాయం కావడం.. రాయి దాడి జరగడం నన్ను బాధించింది. అయితే.. ఆయనకు ఎవరు.. ఏ డాక్టర్ సలహా ఇచ్చారో కానీ.. గాయానికి బ్యాండెయిడ్ వేసుకుని తిరుగుతున్నారు. ఇలా చేయడం సరికాదు. తగిలిన గాయానికి గాలి, వెలుతురు తగిలితే.. అది త్వరగా మాడిపోతుంది. తొందరగా తగ్గిపోతుంది. పైగా పదిహేను రోజులుగా ఈ స్టిక్కర్ అలానే ఉంది. కాబట్టి ఇప్పటికైనా బ్యాండెయిడ్ తీసేస్తే.. త్వరగా తగ్గిపోతుంది. లేకపోతే.. మరింత చీము పట్టి గాయం పెద్దదై..సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. ఓ చెల్లిగా ఓ డాక్టర్‌గా నేను ఈ సలహా ఇస్తున్నా“ అని సునీత పేర్కొన్నారు. మరి ఈ డాక్టర్ చెల్లి సలహాను సీఎం జగన్ పాటిస్తారో లేదో చూడాలి.