వివేకా మర్డర్ కేసులో వైఎస్ సునీతా రెడ్డితో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. తనతో అన్న జగన్…మాట్లాడిన మాటలను సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన సునీత…ఇపుడు హాట్ టాపిక్ గా మారారు. నీ భర్తే వేరే వారితో మర్డర్ చేయించాడేమో అంటూ జగన్ మాట్లాడడం తనను బాధించిందని సీబీఐ అధికారులకు సునీత ఇచ్చిన వాంగ్మూలం ఇపుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ క్రమంలోనే తాజాగా సునీత భర్త రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలం కూడా వెలుగులోకి వచ్చింది. ఆ వాంగ్మూలంలో జగన్ పై రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యతొో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వివేకా హత్యకు జగనే ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తోందని సీబీఐకి రాజజశేఖర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. కోడికత్తి కేసులో తనకు వైద్యం చేసిన ఇద్దరు ప్రైవేటు వైద్యులకు జగన్ కీలక పదవులు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.
వివేకా కేసులో కుటుంబసభ్యుల పాత్ర ఉందని అనుమానించి ఉంటే 2019 ఎన్నికల్లో జగన్, అవినాశ్‌రెడ్డి ఓడిపోయి ఉండేవారని రాజశేఖర్‌రెడ్డి అన్నారు. వివేకా హత్యను రాజకీయాలతో ముడిపెట్టి జగన్ మాట్లాడడం తనకు నచ్చలేదని, అదే విషయాన్ని ఆయనకు చెప్పానని అన్నారు. రాజకీయాలు వద్దనుకొని వివేకా నిర్ణయించుకున్నారని, కానీ, జగన్ ఒత్తిడితో 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. వివేకాను శంకర్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అయిన అప్పులు తీర్చేందుకు హైదరాబాద్‌లో రెండు ఇళ్లు, ఒక ఫ్లాటు, హిమాచల్ ప్రదేశ్‌లోని జలవిద్యుత్ కేంద్రంలోని 10 శాతం వాటా అమ్ముకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. హత్య జరిగిన రోజున కడప మాజీ మేయర్ సురేశ్, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి తన భార్య సునీతతో ఓ కంప్లయింట్ పై సంతకం పెట్టమన్నారని, టీడీపీ నాయకులు సతీశ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి పేర్లను అనుమానితులుగా పేర్కొన్నారని తెలిపారు. కానీ, సంతకం చేసేందుకు సునీత నిరాకరించారని, జగన్ అధికారంలోకి వచ్చాక సిట్‌ను ప్రభుత్వం నీరుగార్చిందని వాంగ్మూలమిచ్చారు.