మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే అవినాష్ రెడ్డిని రెండుసార్లు సీబీఐ అధికారులు విచారణ జరిపారు. వివేకా మర్డర్ వెనుక అవినాష్ రెడ్డి పాత్రపై ప్రాసంగిక సాక్షాలున్నాయంటూ సీబీఐ వెల్లడించిందని కథనాలు కూడా వెలువడుతున్నాయి. వివేకాను లేపేసేందుకు దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డితో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కుట్ర పన్నారని ప్రచారం జరుగుతోంది.
ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, ఉమా శంకర్ రెడ్డిలతో కలిసి శివశంకర్ రెడ్డి ఈ హత్యకు పథకం రచించారని,శివశంకర్ రెడ్డి పరోక్షంగా పాల్గొన్నారని, మిగతా నలుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నారని ప్రచారం జరుగుతోంది. ఇక, గొడ్డలివేటును గుండెపోటుగా మార్చడంలో, రక్తపు మరకలు తుడిచివేయడంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల పాత్ర ఉందని, హత్యకు ముందు రోజు సాయంత్రం అవినాష్ రెడ్డి ఇంట్లోనే సునీల్ యాదవ్ ఉన్నారని, మిగతా నిందితులు కూడా అక్కడ కలుసుకున్నారని పుకార్లు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసులో కీలక నిందితుడైన సునీల్ యాదవ్ కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సునీల్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తాజాగా కొట్టివేసింది. వివేక హత్య కేసు దర్యాప్తు కీలక సమయంలో బెయిల్ ఇవ్వలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది. నిందితుల స్వేచ్ఛ కన్నా సాక్షుల భద్రత, పారదర్శక దర్యాప్తు తమకు ముఖ్యమని ధర్మాసనం అభిప్రాయపడింది.
అంతకుముందు సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వవద్దంటూ కోర్టును సిబిఐ కోరింది. కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుందని, ఈ హత్యలో రాజకీయ పెద్దల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందని, ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. దీంతో, సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకుని వాటితో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు సునీల్ యాదవ్ కు బెయిల్ తిరస్కరించింది.