విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను టీడీపీ, నందమూరి అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 28 నాటికి ఈ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకోబోతున్నాయి. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం విజయవాడలోని పోరంకిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నగారు అసెంబ్లీ ప్రసంగాలను వీడియో, పుస్తక రూపంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై వాటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పై చంద్రబాబుపై రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు.
దీంతో, తలైవాపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రజనీకాంత్ కు ప్రముఖ సినీ నటుడు సుమంత్ బాసటగా నిలిచారు. రజనీకాంత్ వ్యాఖ్యలలో తప్పుపట్టాల్సింది ఏమీ లేదని సుమన్ అన్నారు.హైదరాబాద్ ను ఈ స్థాయికి తీసుకువచ్చింది చంద్రబాబేనని, ఆధునిక హైదరాబాద్ నగర నిర్మాణంలో ముఖ్య శిల్పి చంద్రబాబు అని సుమన్ కొనియాడారు. ఈ రోజు ఎంతో మంది ఐటీ ఉద్యోగులకు హైదరాబాద్ కల్పతరువుగా మారిందంటే దానికి కారణం చంద్రబాబు అని ప్రశంసించారు.
అయితే, కాలం మారిందని చంద్రబాబు తర్వాత మరో ప్రభుత్వం వచ్చిందని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు మంచి ముఖ్యమంత్రి అని, కానీ ఆయనకు బాడ్ టైం నడుస్తోందని అన్నారు. వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ప్రజలు మార్పు కోరుకోవడం వల్ల మరో పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అంతమాత్రాన చంద్రబాబు చేసిన దానిని చేయలేదని ఎలా చెప్పగలం అని సుమన్ ప్రశ్నించారు. వైసీపీ సానుభూతిపరుడిగా పేరున్న సుమన్…తాజాగా చంద్రబాబును ప్రశంసించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.