జరిగింది.. ఘోరం! ఎవరూ కాదనరు. తొక్కిసలాటకు బాధ్యులను గుర్తించడం ఇప్పుడు విధి. జరిగింది జరిగిపోయింది. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉం టుంది. ఇది అధికారుల పనికాదు. అధికారులు కేవలం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తారు. గతంలో రాజస్థాన్లో ఓ వ్యాపారి తన పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని చీరలు పంచారు. ఈ కార్యక్రమానికి ఊరూ వాడా వారం ముందే టముకు వేశారు.
దీంతో వేలాది మంది చీరల కోసం ఎగబడ్డారు. అప్పట్లో జరిగిన(రెండేళ్ల కిందట) తొక్కిసలాటలో ఏకంగా 103 మంది మహిళలు మృతి చెందారు. దీనిపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. అధికారులను బాధ్యుల ను చేయడం వరకు ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. ప్రభుత్వం అంటే ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, అధికారులతో కూడిన వ్యవస్థగా తీర్పు చెప్పింది. ఈ క్రమంలోనే అప్పటి రాజస్థాన్ మహిళా సంక్షేమ శాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది.
కట్ చేస్తే.. ఇప్పుడు అంత పెద్ద ఘటన జరగకపోయినా.. సీఎం, డిప్యూటీ సీఎంలు ఇక, సంయమనం పాటించాలి. అధికారులను తప్పుబడుతున్న వైనం బాగానే ఉన్నా.. ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించుకోవా ల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ఎక్కువగా తెరమీదికి వస్తోంది. కేవలం అధికారులను సస్పెండ్ చేసి.. చేతులు దులుపుకొంటారా? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. టీటీడీ పాలక మండలిని ఏకంగా బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి `క్షమాపణలు` చెప్పాలనిడిప్యూటీ సీఎం కోరడం.. కూడా సహేతుకంగా లేదన్న వాదన వినిపిస్తోంది.
జరిగింది తప్పో.. ఘోరమో.. పోయిన ప్రాణాలైతే రావు. కానీ, శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వైకుం ఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలకు 6-8 లక్షల మంది భక్తులు వస్తున్నారు. వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ సమయంలో అధికారుల్లో ఆత్మస్థయిర్యం కోల్పోయేలా చేయడం కూడా సరికాదు. సో.. జరిగిన దానిని వదిలి పెట్టి.. జరగాల్సింది చూడడమే ప్రభుత్వం ముందున్న ప్రధాన కర్తవ్యమని పరిశీలకులు చెబుతున్నారు.