ఒక అమ్మాయి తాను చదివే కాలేజీలోనే ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించింది. ముందు అది ఆత్మహత్య అనుకున్నారంతా. కానీ తీరా చూస్తే అది హత్య అని.. ఆ అమ్మాయిని చంపడానికి ముందు తనపై కొందరు అత్యాచారం కూడా చేశారని తేలింది. ఇదంతా జరిగింది ఒక కాలేజీ హాస్టల్లో. ఆ అమ్మాయికి జరిగిన దారుణమేంటో అందరికీ అర్థమైంది. కానీ ఇప్పటిదాకా ఆ కేసులో ఏమీ తేలలేదు.
నిందితులు ఫలానా వాళ్లు అని గట్టిగా ప్రచారం జరిగింది. కానీ ఏ చర్యలూ లేవు. కేసులో ఏ పురోగతీ లేదు. ఇదీ కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి విషాదాంతం. తన కూతురికి జరిగిన అన్యాయంపై ప్రీతి తల్లి కొన్నేళ్లుగా పోరాడుతోంది. కానీ ఏ ప్రయోజనం లేకపోయింది. నిందితుడు అధికార పార్టీ సామాజిక వర్గం కావడంతో వైసీపీ ప్రభుత్వం న్యాయం చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత ఏడాది జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తన బాధ చెప్పుకుంటే.. ఆయన ప్రీతికి న్యాయం చేయాలని పోరాడారు. ఫలితంగా జగన్ సర్కారు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటన చేసింది. దీంతో వాస్తవాలు బయటికి వస్తాయని, నిందితులకు శిక్ష పడుతుందని అంతా అనుకున్నారు. కానీ నెలలుగా గడిచినా ఏమీ జరగలేదు.
అసలీ కేసును సీబీఐ టేకప్ చేయనే లేదు. ఈ విషయమై సుగాలి ప్రీతి తల్లిదండ్రులిద్దరూ ఢిల్లీకి వెళ్లి సీబీఐ ప్రధాన కార్యాలయంలో అధికారులను కలవగా.. ఈ కేసును తాము టేకప్ చేయాలని ఎలాంటి ఉత్తర్వులు రాలేదని తేల్చారట. ఏపీ సర్కారు ఈ విషయమై ఇచ్చిన జీవో బోగస్ అని తేల్చారని చెబుతూ.. ఈ ఉత్తర్వులకు సంబంధించిన ప్రతులను మీడియా ముందు చించి పడేశారు ప్రీతి తల్లిదండ్రులు. ఇది జగన్ సర్కారు పరువు తీసే పరిణామం అనడంలో సందేహం లేదు.