ఒక మంచి హిట్ కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు సుధీర్ బాబు. మొదట్లో మహేష్ బాబు బావ అనే గుర్తింపుతోనే సాగిన సుధీర్.. తర్వాత కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, నన్ను దోచుకుందువటే, సమ్మోహనం లాంటి చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించాడు. ఐతే ఆపై నటుడిగా పేరొస్తున్నా కమర్షియల్ సక్సెస్‌లు లేక అతను ఇబ్బంది పడుతున్నాడు. చివరి సినిమా ‘మామా మశ్చీంద్ర’ దారుణమైన ఫలితాన్నందుకుంది.
ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘హరోం హర’ మీదే ఉన్నాయి. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ ఆసక్తికరంగా అనిపించింది. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు. అది మరింత ఆకర్షణీయంగా ఉండి సుధీర్ బాబుకు చాన్నాళ్ల తర్వాత ఒక హిట్ పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘పుష్ప’ తర్వాత చాలామంది చిత్తూర బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ‘హరోం హర’ దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక కూడా ఆ బ్యాక్‌డ్రాపే ఎంచుకున్నాడు.
ఆ ప్రాంతంలో ఎక్కువమంది పెట్టుకునే సుబ్రహ్మణ్యం పేరును హీరోకు పెట్టి, సుబ్రహ్మణ్యస్వామి కోసం కావడి ఎత్తినపుడు పలికే ‘హరోం హర’ అనే మాటను టైటిల్‌గా సెట్ చేశాడు. ఇందులో హీరో కుప్పం ప్రాంత వాసి కావడం విశేషం. పేద కుటుంబానికి చెందిన హీరో గన్స్ తయారు చేసే పనికి కుదురుతాడు. ఆ క్రమంలో కొన్నాళ్లకు గన్స్ తన చేతికి తీసుకుని వాడడం మొదులపెడతాడు. దీంతో అతడి స్థాయి పెరుగుతుంది.
అందుకు తగ్గట్లే సమస్యలూ పెరుగుతాయి. ఈ నేపథ్యంలో అతను చేసిన యుద్ధం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ట్రైలర్ అంతా యాక్షన్ ప్యాక్డ్గా సాగింది. చిత్తూరు యాసతో సాగిన డైలాగులు బాగున్నాయి. ‘పుష్ప’లో చిత్తూరు యాసను ఔపాసన పట్టిన సునీల్.. ఇందులోనూ ఓ కీలకమైన పాత్రలో మంచి డైలాగులు పలికాడు. టీజర్లో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. మొత్తంగా చూస్తే ట్రైలర్ ఆసక్తికరంగా అనిపిస్తూ సినిమా మీద అంచనాలు పెంచుతోంది.