కరోనా కాలంలో సెకండ్ వేవ్ ఒక కొలిక్కి వస్తున్న వేళ.. రోటీన్ దిశగా ప్రపంచం అడుగులు వేయటం షురూ చేస్తోంది. గత నెలలో ఇదే సమయానికి (మే 12) దేశ వ్యాప్తంగా కరోనా కేసులతో ఎంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే.
అప్పటి పరిస్థితితో పోలిస్తే.. ఇప్పుడు చాలానే మార్పులు వచ్చాయని చెప్పాలి. కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తి వేస్తే.. మరికొన్ని రాష్ట్రాల్లో ఆ దిశగా లాక్ డౌన్ పొడిగింపు పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులు తమ ప్రయత్నాల్ని షురూ చేస్తున్నారు.
దీనికి తగ్గట్లే అమెరికా తమ దేశంలో చదువుకోవటానికి వచ్చే విద్యార్థులకు వీసాలు ఇచ్చే కార్యక్రమానికి తెర తీసింది. ఈ నెల 14 నుంచి వీసా అపాయింట్ మెంట్లు యథాతధంగా ఉంటాయని చెబుతోంది.
విద్యార్థులకు వీసాలు ఇస్తాం కానీ.. వారి తల్లిదండ్రులకు మాత్రం ఇప్పుడే వీసాలు ఇవ్వలేమని.. అందుకు మరికొంత కాలం వెయిట్ చేయాలని చెబుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వర్సిటీల్లో ఆడ్మిషన్లు పొందిన విద్యార్థులు టీకా వేసుకొని వెళ్లాలా? వద్దా? అన్నది సందేహం మారింది.
దీనికి సంబంధించిన మినిస్టర్ కౌన్సెలర్ ఫర్ కాన్సులర్ ఎఫైర్స్ డాన్ హెప్లిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీకాలపై ఉన్న విద్యార్థుల సందేహాలు తీరేలా ఆయన సమాధానాలు ఇచ్చారు.
వ్యాక్సిన్ వేసుకొనే అమెరికాకు రావాలన్న ఒత్తిడి ఎంతమాత్రం లేదని చెప్పారు. అయితే.. ప్రయాణానికి మూడు రోజుల ముందు కొవిడ్ టెస్టు చేయించుకొని.. దానికి సంబంధించిన నెగిటివ్ రిపోర్టు ఉండాలని స్పష్టం చేస్తున్నారు.
వ్యాక్సిన్ వేయించుకొని అమెరికాకు రావాలా? వద్దా? అన్న విషయంపై అమెరికా ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేయటటం లేదని పేర్కొన్నారు. కాకుంటే.. కొన్ని వర్సిటీలు టీకా తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నాయని.. మరికొన్ని అందుకు భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే.. విద్యార్థులు తాము ఆడ్మిషన్లు పొందిన వర్సిటీ అధికారుల్నే టీకా పాలసీ గురించి అడగాలన్న సూచన చేస్తున్నారు.
అదే సమయంలో భారతీయ విద్యార్థులు తమ దేశంలో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికి.. స్థానిక టీకా తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పిన వర్సిటీల్లోనే వేయించుకోవటం ఉత్తమమని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వర్సిటీ టీకా పాలసీ గురించి తెలుసుకొని.. అందుకుతగ్గట్లు టీకా వేయించుకోవటమా? లేదా? అన్న విషయంపై ఒక స్పష్టతకు వస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.