ప్రస్తుతం ఏపీలో జగనన్న ఇళ్లపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పి…ఆ తర్వాత లబ్ధిదారులకు మెటీరియల్ , డబ్బు కూడా ఇస్తాం అనే ఆప్షన్ ఎంచుకోవాలంటూ బలవంతపెట్టడంపై విమర్శలు వచ్చాయి. అయితే, జగన్ గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చిన సెంటున్నర స్థలం…పట్టణాల్లో ఇచ్చిన సెంటు స్థలంలో నిర్మించుకునే ఇల్లు చాలా చిన్నదిగా ఉందని స్వయానా వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
జగనన్న ఇళ్లలో హాల్లో శోభనం చేసుకోవాలేమోనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. పోనీ ఆ చిన్నగా ఉన్న ఇళ్ల నిర్మాణం అయినా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందంటే అదీ లేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు హయాంలో గత ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాడు-నేడు…అంటూ చంద్రబాబు, జగన్ ల హయాంలోని ఇళ్ల నిర్మాణంపై టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి.
విజనరీ నాయకుడు చంద్రబాబును కాదని జగన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చిన ప్రజలను ఆయన నట్టేట ముంచుతున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. భూకంపం వచ్చినా చెక్కు చెదరని టెక్నాలజీ వాడిన హైటెక్ భవన సముదాయాన్ని, అపార్టమెంట్ల రూపంలో చంద్రబాబు నిర్మించారని, గట్టిగా గాలివస్తే ఉంటుందో ఊడుతుందో తెలియని ఇళ్లను జగన్ పేదలకు ఇస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు హయాంలో పక్కా ఇళ్లు…జగన్ హయాంలో తొక్కలో ఇళ్లు అంటూ సెటైర్లు వేస్తున్నారు.