ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. సీఎం జగన్ కు ఎస్ఈసీ షాకుల మీద షాకులిస్తోంది. ఇప్పటికే పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్….తాజాగా ప్రభుత్వానికి మరో షాకిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఏపీలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఆపేయాలని నిమ్మగడ్డ ఆదేశించడం చర్చనీయాంశమైంది. మరోవైపు, అమల్లో ఉన్న పథకాలను తక్షణమే ఆపేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయించినా ఓటర్లను ప్రభావితం చేసినట్టేనని నిమ్మగడ్డ వెల్లడించారు.
సోమవారంనాడు రెండో విడత అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించేందుకు జగన్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో కోడ్ అమల్లోకి వస్తుందని ఎస్ఈసీ చెప్పడం జగన్ సర్కార్ కు మింగుడుపడడం లేదు. మరోవైపు, ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీపై కూడా కోడ్ ఎఫెక్ట్ పడింది. ఇవి రెండే కాదు ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలన్నీ కోడ్ పరిధిలోకి వస్తాయి. మరి ఈ విషయంపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అంతకుముందు, స్థానిక సంస్థల ఎన్నికలను ఆపేయాలని కోరుతూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఏది ఏమైనా నిమ్మగడ్డకు షాకివ్వాలనుకున్న జగన్ కు నిమ్మగడ్డ తన మార్క్ షాకులిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.