తన ఇష్టమైన వారిని నెత్తిన ఎత్తుకోవడంలోనూ.. తనకు నచ్చనివారిని విసిరి కొట్టడంలోనూ సిద్ధహస్తురా లిగా పేరొందిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కొన్నాళ్లుగా కాంగ్రెస్‌తో కయ్యానికి దిగుతు న్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై చిర్రుబుర్రులాడుతున్నారు. ఇండియా కూటమి లేదని వ్యాఖ్యానించిన ఆమె.. తాజాగా రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర తన రాష్ట్రంలోకి అడుగు పెట్టినా కనీసం తనకు సమాచారం లేదని విమర్శించారు.
“యాత్ర సజావుగానే సాగాలని కోరుతున్నా“ అని రెండు రోజుల కిందట మమత నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆమె అలా అన్నారో లేదో.. తాజాగా రాహుల్ యాత్రపై రాళ్లు పడ్డాయి. జోడో న్యాయ యాత్ర కాన్వాయ్‌పై బుధవారం కొందరు దుండగులు రాళ్లు విసిరి రచ్చ చేశారు. దీంతో రాహుల్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా డ్యామేజీ అయింది. బెంగాల్, బీహార్ సరిహద్దులోని మాల్దా జిల్లాలో చోటు చేసుకున్న ఈ దాడి.. మమత సర్కారు నిర్లక్ష్యానికి ఉదాహరణ అని.. కాంగ్రెస్నాయకులు విమర్శలు గుప్పించారు.
అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి వెల్లడించారు. మరోవైపు రాళ్ల దాడి అనంతరం.. మాల్దాలో యాత్రను తాత్కాలికంగా నిలిపి వేశారు. ఉద్దేశ పూర్వకంగానే రాహుల్ కాన్వాయ్‌ను కొందరు టార్గెట్ చేశారని చౌదరి చెప్పారు. దాడి ఘటన వెనుక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు. మరోవైపు రాహుల్ ‘యాత్ర’కు అడ్డంకులు కలుగుతున్న నేపథ్యంలో భద్రత కల్పించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాశారు.