అనుకోని రీతిలో ఏదైనా పరిణామం చోటు చేసుకుంటే.. అలాంటి సమయంలో పోలీసులు మరింత పక్కాగా వ్యవహరించాల్సి ఉంటుంది. సున్నితమైన అంశాల్ని డీల్ చేసే విషయంలో జరిగే తప్పులు కొత్త సమస్యలకు కారణమవుతాయి. తాజాగా గుంటూరులో చోటు చేసుకున్న ఒక ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారటం ఒక ఎత్తు అయితే.. ఈ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా రోడ్డులో మంత్రి విడుదల రజనీ తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే.. ఈ కొత్త కార్యాలయాన్ని తెలుగుదేశం వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఎదురుగా ఉన్న భవనంలో వైసీపీ ఆఫీసు ఏర్పాటు చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుననారు.మరో రెండు రోజుల్లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో.. డిసెంబరు 31న రాత్రి వేళ కొందరు అల్లరి చేస్తూ.. మంత్రి రజనీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. ఈ ఉదంతంలో ఆఫీసు అద్దాలు పగిలాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు.
తమ కొత్త ఆఫీసుపై రాళ్లు రువ్విన ఉదంతంపై తీవ్రంగా స్పందించిన మంత్రి రజనీ.. అందుకు కారణమైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త ఆఫీసు వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. అర్థరాత్రి వేళ ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి పసుపు చొక్కా ధరించి.. అటువైపు వెళుతున్న వేళ.. అతన్నిఆపిన పోలీసులు.. పచ్చచొక్కా ధరించినవ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
తాను.. కుటుంబంతో కలిసి వెళుతున్న విషయాన్ని తెలపగా.. అతడి పట్ల అమర్యాదగా వ్యవహరించిన పోలీసులు.. అతన్ని చొక్కా పట్టుకొని పోలీసు జీపులో స్టేషన్ కు తీసుకెళ్లారు. పచ్చ చొక్కా ధరించటం తప్పా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహంవ్యక్తమవుతోంది. తప్పు చేసిన వారిని పట్టుకొని శిక్షించాలే కానీ.. తమకే మాత్రం సంబంధం లేని అంశంలో ఇలాంటి వ్యవహరించటం ఏమిటంటూ సదరు వ్యక్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.