ఆధునిక ప్రపంచంలో ప్రతి మనిషి చేతిలో సెల్ ఫోన్ అనేది కనీస అవసరంగా మారిపోయింది. డబ్బా ఫోన్లు పోయి స్మార్ట్ ఫోన్లు రావడంతో జనమంతా ఆండ్రాయిడ్, ఐ ఫోన్ల వైపు పరుగులు తీస్తున్నారు. అయితే అదే సమయంలో సెల్ ఫోన్ల దొంగతనాలు పెరిగిపోయాయి. ఎంత సాంకేతిక వినియోగించి దొంగలను పట్టుకుంటున్నా దానికి భిన్నంగా దొంగతనాలు జరుగుతున్నాయి.
దొంగిలించిన సెల్ ఫోన్లను ఏకంగా సముద్రమార్గం ద్వారా సూడాన్ కు తరలిస్తున్న అంతర్జాతీయ ముఠాను హైదరాాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు రూ.1.75 కోట్ల విలువైన 703 సెల్ ఫోన్లను సూడాన్ కు పంపినట్లు గుర్తించారు. బేగంపేట విమానాశ్రయం సమీపంలోని తాడ్ బంద్ కు చెందిన మహ్మద్ ముజమ్మిల్ (19), సయ్యద్ అబ్రార్ (19) లు ఇద్దరూ సెల్ ఫోన్లను చోరి చేస్తున్నారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పల్సర్ బైక్‌ను చోరీ చేసిన వారు బండ్లగూడ, ఫలక్‌నుమా, బహదూర్‌పురా, మంగళ్‌హాట్, హయత్‌నగర్ ప్రాంతాలలో సెల్ ఫోన్లను దొంగతనాలు చేశారు. దీనిపై కన్నేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
సెల్ఫోన్లను దొంగిలిస్తున్న దొంగలతో పాటు వాటిని కొంటున్న వారు, వాటిని ఎగుమతి చేస్తున్న వారు మొత్తం 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు సూడాన్ దేశస్థులు ఉండడం విశేషం. నిందితులు దొంగతనం చేసిన ఫోన్లను జగదీశ్ మార్కెట్లో దుకాణాలు నిర్వహిస్తున్న మహ్మద్ షఫీ అలియాస్ బబ్లూ , బంజారాహిల్స్‌కు చెందిన జె.యలమందర్రెడ్డిలకు విక్రయిస్తున్నారు.
వారు ఆ ఫోన్లను సూడాన్‌కు చెందిన అబ్దేలా అహ్మద్ ఉస్మాన్ బాబికర్, బంజారాహిల్స్‌కు చెందిన అయమ్ మహ్మద్ సాత్ అబ్దేలా, ఆనస్ సిద్దిగి ఆల్బేండర్ అహ్మద్, ఒమర్ అబ్దెల్లా ఇతయాబ్ మహ్మద్ ల సహకారంతో సూడాన్‌కు పంపి అక్కడ సెల్ ఫోన్లను అమ్ముకుంటుండడం విశేషం. ఆది సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రౌడీలను అస్సాంకు పార్శిల్ చేసినట్లు దొంగిలించిన సెల్ ఫోన్లను నిందితులు సూడాన్ కు పార్శిల్ చేస్తున్నారన్నమాట.