జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఎండ వేడిమి, డీహైడ్రేషన్, స్కిన్ ఎలర్జీతో అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ఇద్దరు ప్రభుత్వ డెర్మటాలజిస్టులు చికిత్స అందిస్తున్నారు. చంద్రబాబుకు గడ్డం, చేతులు, ఛాతీపై దద్దుర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగిస్తున్నారని, ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం నిజాలు చెప్పడం లేదని సంచలన ఆరోపణలు చేశారు.
చంద్రబాబుకి ఏదైనా జరిగితే జగన్ దే బాధ్యత అని, జైల్లో చంద్రబాబుకు తగిన భద్రత లేదని ఆరోపించారు. దోమలు, కలుషిత నీరు, బరువు తగ్గడం, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు ఉన్నా సకాలంలో చంద్రబాబుకు వైద్య సహాయాన్ని అందించలేదని ఆరోపించారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యాన్ని సకాలంలో అందించడంలో ప్రభుత్వం విఫలమైందని నారా భువనేశ్వరి ఆరోపించారు.
చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని, ఇంకా తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. జైల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయని అన్నారు. చంద్రబాబును అపరిశుభ్రమైన వాతావరణంలో జైల్లో నిర్బంధించారని, ఇది హృదయవిదారమని నారా బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబుకు సకాలంలో వైద్యం అందడం లేదని, ఆయన ఆరోగ్యం గురించి తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని అన్నారు.