కర్ణాటక రాష్ట్రంలో సంచలనంగా మారిన మాజీ ముఖ్యమంత్రి ధరంసింగ్ సన్నిహిత బంధువు సిద్ధార్థ సింగ్ (28) హత్యకు సంబంధించిన చిక్కుముడులు వీడాయి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితురాలు హతుడి సవతితల్లిగా గుర్తించారు. తాజాగా ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. సిద్దార్థ్ తండ్రి దేవేందర్ సింగ్ కు ఇందూ చౌహాన్ రెండో భార్య. తిరుపతికి చెందిన శ్యామ్.. వినోద్ లకు సుపారీ చెల్లించి మరీ.. సిద్ధార్థను చంపించింది. జనవరి 19న హతుడ్ని కిడ్నాప్ చేసి.. కారు సీటు బెల్టుతో గొంతుకు ఉరి వేసిన నిందితులు.. దారుణంగా హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చి.. రాపూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టారు.
అమెరికాలో చదువుకున్న సిద్దార్థ.. బెంగళూరులోని ఒక ప్లాట్ లో ఒంటరిగా ఉండేవాడు. అతడు సొంతంగా ఒక స్టార్టప్ స్టార్ట్ చేసి నిర్వహిస్తున్నారు. ఈ దారుణ హత్యకు కారణం వ్యక్తిగత కక్షలు.. ఆస్తి తగదాలే కారణమని భావిస్తున్నారు. ఉన్నతకుటుంబంలో ఆస్తి కోసం ఇంత దారుణంగా హత్య చేయటం.. చేయించింది సవతితల్లి కావటం షాకింగ్ గా మారింది. ఈ హత్యలో మరికొంతమంది కూడా పాలుపంచుకొని ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు మరింత లోతుగా ఈ కేసును విచారిస్తున్నారు.