పుష్ప-2 ప్రిమియర్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన ఘటన ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ఆ మహిళ మృతికి కారణమయ్యాడంటూ హీరో అల్లు అర్జున్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం, ఒక రోజు జైల్లో ఉన్న తర్వాత బన్నీ రిలీజ్ కావడం.. తదనంతర పరిణామాలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
ఈ వ్యవహారంలో బన్నీ చేసిన తప్పుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కాక.. పోలీసు ఉన్నతాధికారులు విస్తృతంగా మాట్లాడారు. సీఎం అసెంబ్లీ వేదికగా థియేటర్ విజిట్ సందర్భంగా బన్నీ చేసిన తప్పిదాల గురించి వివరించారు. బన్నీ ర్యాలీగా రావడం, అభిమానులకు చేతులు ఊపడం వల్లే తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందిందని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను బట్టి చూస్తుంటే బన్నీ రావడానికి ముందే తొక్కిసలాట జరిగినట్లు కనిపిస్తోంది.
బన్నీ 9 గంటల 35 నిమిషాల ప్రాంతంలో సంధ్య థియేటర్‌కు వచ్చినట్లుగా వీడియోల్లో కనిపిస్తోంది. పోలీసులు ఇంతకుముందే రిలీజ్ చేసిన వీడియోల్లో కూడా బన్నీ ఆ సమయానికే వచ్చినట్లు తెలుస్తోంది. కానీ అంతకంటే ముందే థియేటర్లో తొక్కిసలాట జరిగి కొందరిని జనం థియేటర్ నుంచి మోసుకుని బయటికి తీసుకువెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఆ తొక్కిసలాట 9.13 ప్రాంతంలో జరిగింది.
రేవతి కూడా అప్పుడు జరిగిన తొక్కిసలాటలోనే తీవ్రంగా గాయపడిందని.. ఆ తర్వాత ప్రాణాలు వదిలిందని అంటున్నారు. ఈ తొక్కిసలాట అనంతరం గాయపడ్డ వారిని బయటికి తీసుకెళ్తున్న వీడియో, అలాగే బన్నీ థియేటర్లోకి బన్నీ ఎంటరవుతున్న వీడియో.. రెండూ పెట్టి వాటి టైమింగ్స్ గురించి నెటిజన్లు చర్చిస్తున్నారు. ఈ వీడియోలు ఎంత వరకు వాస్తవం అన్నది తేలాల్సి ఉంది. కానీ ఇదే నిజమైతే మాత్రం ఈ కేసులో బన్నీ తప్పిదం ఏమీ లేదని.. మహిళ మృతితో అతడికి సంబంధం లేదని భావించాల్సి ఉంటుంది.