మన దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ఎస్ఎస్ జీ భద్రత ఉండడం సహజం. కానీ, ఏపీలో మాత్రం ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు..అంటే సీఎం తల్లిదండ్రులు, భార్యా, పిల్లలకు కూడా ఎస్ఎస్ జీ భద్రత కల్పించడం…ఇంకా చెప్పాలంటే ఒక వేళ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నా సరే వారికి భద్రత కల్పించడం మాత్రం నిజంగా వింతే.
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా తీసుకొచ్చిన ఈ చట్టంపై విమర్శలు వస్తున్నాయి. డిసెంబరు 23 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చిందని జనవరి 24న గెజిట్ నోటిషికేషన్ జారీ కావడంతో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ముఖ్యమంత్రి.. ఆయన సతీమణి.. వారి పిల్లలు.. తల్లిదండ్రులకు ఇంట్లోనూ.. ప్రయాణ సమయంలోనూ.. ఎక్కడైనా బస చేసినప్పుడు.. ఇతర కార్యక్రమాలకు వెళ్లినప్పుడు.. వేడుకలకు హాజరైనప్పుడు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి సందర్భంలోనూ ఎస్ఎస్ జీ నిరంతరం భద్రత కల్పించాల్సి ఉంటుందన్నమాట.
వారి దగ్గరకు ఎవరు రావాలన్నా నియంత్రించడం..దేశవిదేశాల్లో వారికి అవసరమైన భద్రతాపరమైన సేవలు అందించేందుకు వీలుగా ఎస్ఎస్ జీకి చెందిన సభ్యులు రెడీగా ఉండాలన్నమాట. అయితే, ఏ రాష్ట్రంలోనూ లేని ఈ కొత్త చట్టం ఏపీలో తేవడంపై విమర్శలు వస్తున్నాయి. జగన్ కు అభద్రతా భావం ఎక్కువని, ప్రజా వ్యతిరేకత వల్లే ఈ చట్టాన్ని తెచ్చారని సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ జరుగుతోంది. నక్సలైట్ల దాడి నుంచి తప్పించుకున్ప తర్వాత చంద్రబాబు సైతం ఇటువంటి భద్రతను పెట్టుకోలేదని గుర్తు చేస్తున్నారు.